వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్

వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్
* ప్రధాన మోదీ అభినందనలు

ఆంథోనీ అల్బనీస్ మరోసారి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కానున్నారు. గత 21 సంవత్సరాలలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధాని పీఠాన్ని దక్కించుకున్న విశిష్ఠ నాయకుడిగా అల్బనీస్ నిలిచారు. 150 సీట్లు కలిగిన ఆస్ట్రేలియా ప్రతినిధుల సభకు శనివారం రోజు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్‌ను ఆయన ఓడించారు.  ఆంథోనీ అల్బనీస్ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార లేబర్ పార్టీ అత్యధికంగా 76 సీట్లను గెల్చుకునే దిశగా ముందుకు సాగుతోందని ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి.

సంకీర్ణ కూటమి అభ్యర్థులు 36 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల పరిశీలకులు అంచనాలను విడుదల చేశారు. లేబర్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.  మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా సంకీర్ణ కూటమికి దక్కదని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో లేబర్ పార్టీకి 78 సీట్లు వచ్చాయి. ఈసారి 2 సీట్లను కోల్పోయి 76 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్నపార్టీల మద్దతునూ లేబర్ పార్టీ కూడగట్టింది. తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. “ఈ సారి ఎన్నికల ప్రచారంలో మేం తగినంతగా రాణించలేదు. ఎన్నికల ఫలితాల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి నేను పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నాను” అని ఆయన తెలిపారు. “ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడానికి నేను ప్రధానమంత్రికి ఫోన్ చేశాను. ఇది లేబర్ పార్టీకి ఒక చారిత్రాత్మక సందర్భం” అని ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్‌ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో ఫలించిన ‘డోజ్’ అస్త్రం

లిబరల్ పార్టీ నుంచి పీటర్ డట్టన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీటర్ డట్టన్‌‌‌ను ‘డోజ్ – వై డట్టన్’ అని విమర్శిస్తూ ఈ ఎన్నికల్లో ఆంథోనీ అల్బనీస్‌కు చెందిన లేబర్ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పీటర్ డట్టన్‌‌‌ గెలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వపు డోజ్ విభాగాన్ని ఆస్ట్రేలియాలోనూ ఏర్పాటు చేస్తారని ప్రచారంలో విరుచుకుపడ్డారు. 

డోజ్‌ విభాగం ద్వారా దేశంలో పెద్దఎత్తున ఉద్యోగ కోతలు విధిస్తారని లేబర్ పార్టీ ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఫలించి లేబర్ పార్టీ మరోసారి గెలిచింది. “ఆస్ట్రేలియా ప్రజల ప్రయోజనాల కోసం మేం చైనాతోనైనా స్నేహం చేస్తాం. ఆ దేశంతోనూ సంబంధాలను బలోపేతం చేశాం. 2022లో మేం గెలవగానే ఆస్ట్రేలియా- చైనా మధ్యనున్న వాణిజ్య అవరోధాలను తొలగించాం” అని ఈ ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆంథోనీ అల్బనీస్‌‌ను ఓటర్లు ఆశీర్వదించారు.

మరోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఆంథోనీతో కలిసి ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని మోదీ చెప్పారు. “మీ సమర్థ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజలు అపారమైన నమ్మకం ఉంచారు. అందుకే మరో విజయం లభించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత, వికాసం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం” అని పేర్కొంటూ భారత ప్రధాని ఓ ట్వీట్ చేశారు.