
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్‌నాథుని ఆలయ తలుపులు తెరచుకున్నాయి.
వివిధ దేశాల నుంచి తెప్పించిన 108 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధామ్ పోర్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొని, కేదార్‌నాథ్ ప్రాంగణంలో జరిగిన ముఖ్య సేవక్ భండారాలో భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. మే 4న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని ఆయన ప్రకటించారు.
“దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది” అని సీఎం ధామి పేర్కొన్నారు. “మేము ప్రతి స్థాయిలోనూ తీర్థయాత్రను నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. యాత్రా మార్గాల్లో అనేక ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేసాము. చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ జీవనాడి. లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తుంది” అని చెప్పారు.
చార్ ధామ్ యాత్రను ఏడాది పొడవునా కార్యక్రమంగా మార్చడానికి ప్రభుత్వం నిబద్ధతను కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించాయిరు, ఈ చొరవలో భాగంగా శీతాకాల తీర్థయాత్రలను ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేదార్‌నాథ్ పునర్నిర్మాణానికి రూ. 2,000 కోట్లు కేటాయించినట్లు సీఎం ధామి వెల్లడించారు. అదనంగా, ప్రాప్యతను మెరుగుపరచడానికి గౌరికుండ్ నుండి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న అక్షయ తృతీయతో ప్రారంభమైందని చెబుతూ మే 4న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని, ఆ తర్వాత తీర్థయాత్ర పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలిపారు. “యాత్ర సమయంలో భక్తులకు సురక్షితమైన, సజావుగా ప్రయాణం ఉండేలా మేము విస్తృతమైన ఏర్పాట్లు చేసాము, తద్వారా వారు యాత్ర సమయంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు” అని ఆయన హామీ ఇచ్చారు.
ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు గత నెల 30న తెరుచుకున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి.
చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు