పాక్ ను ఆర్ధికంగా ఏకాకి చేయండి!

పాక్ ను ఆర్ధికంగా ఏకాకి చేయండి!
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థికపరమైన చక్రవ్యూహంలో బంధించాలని భారత్‌ యోచిస్తోంది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలను విధించే లక్ష్యంతో ఏర్పడిన ఆర్థిక కార్యాచరణ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్టులో పాకిస్థాన్‌ను తిరిగి చేర్చాలని ఒత్తిడి తీసుకురావాలని భారత్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
పాకిస్థాన్‌పై రెండు రకాలుగా ఆర్థికపరమైన ప్రతీకార చర్యలు చేపట్టాలని భారత్‌ యోచిస్తోంది. అందులో మొదటిది పాకిస్థాన్‌ను మళ్లీ ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో చేర్చించేలా లాబీ చేయడం. దేశంలోని ఉగ్రవాద గ్రూపులకు సరిహద్దుల అవతల నుంచి అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవాలన్న విస్తృతమైన వ్యూహంలో భాగంగా ఈ చర్య చేపట్టాలన్నది భారత్‌ ఆలోచన చేస్తున్నది.
 
ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో పాక్‌ను చేర్చాలన్న డిమాండును ముందుకు తీసుకెళ్లాలంటే తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పాకిస్థాన్‌ గతంలో 2018 జూన్‌ నుంచి 2022 అక్టోబర్‌ వరకు ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో ఉంది. గతంలో ఈ లిస్టులో ఉన్న రోజుల్లో దేశంలోకి అక్రమ నిధుల ప్రవాహం తగ్గిందని భారత్‌ వాదిస్తోంది.
 
 ఇక రెండో చర్య పాకిస్థాన్‌కు రుణాలు అందచేస్తున్న బహుళ ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి రుణాలు ఇవ్వకుండా అడ్డుకోవడం. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తోసహా ప్రధాన ఆర్థిక సంస్థలతో బహిరంగ చర్చలు ప్రారంభించాలని భారత్‌ భావిస్తున్నట్లు ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ప్రపంచమంతా కలిసి పాకిస్థాన్‌ను ప్రత్యేకించి ఆర్థికంగా ఏకాకిని చేయాల్సి ఉందని భారతదేశం కోరింది. ముందుగా పాకిస్థాన్‌కు ఆర్థిక నిధుల చేరవేత నిలిచిపోవాల్సి ఉంది. రుణాలు , గ్రాంట్ల నిలిపివేత నిర్ణయాలు తీసుకోవల్సి ఉందని, ఈ దిశలో బహుళ స్థాయి ఆర్థిక సంస్థలు తక్షణం స్పందించాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం శనివారం అధికారికంగా స్పందించింది. 

ఇటీవలే కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులను వధించారు.ఈ హేయమైన అ నాగరిక, ఆటవిక చర్య మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. అక్కడి ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అందే ఇతరత్రా నిధుల నుంచి భారీ సొమ్మును కేటాయిస్తోంది. ఈ క్రమంలో ఈ ఉగ్రవాదులు బరి తెగించి సీమాంతర దాడులకు దిగుతున్నారు. 

ఈ క్రమంలో పాకిస్థాన్ చర్య అంతర్జాతీయ కట్టుబాట్లకు విఘాతం కల్పించేదిగా మారింది. ఇక దీనిని ఎ సంస్థ కూడా ఉపేక్షించరాదు. వెంటనే స్పందించి , అనధికారిక ఉగ్రదేశం అయిన పాకిస్థాన్‌కు రుణాలు, గ్రాంట్లను నిలిపివేయాల్సి ఉందని భారత ప్రభుత్వం కోరిందని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి.

నిధుల నిలిపివేత జరిగితే పాకిస్థాన్ పరిస్థితి నీళ్లు ఎండిన చెరువు అవుతుంది.  పాకిస్థాన్‌కు ఐఎంఎప్, ప్రపంచ బ్యాంక్ ఇతరత్రా ఏ ఆర్థిక సంస్థ నుంచి సాయం అందకుండా చర్యలు తీసుకోవల్సి ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్‌ను ఏకాకిని చేసేందుకు పలు ప్రపంచ స్థాయి వేదికలు, సంస్థలు, ఐఎంఎఫ్, ఐరాస వంటి కీలక అంతర్జాతీయ విభాగాలు స్పందించాల్సి ఉందని భారత్ పేర్కొంది. 
 
ఒక్కరోజు క్రితమే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఊతం అంతకు మించి ఆజ్యం పోస్తున్న పోకిరి, అరాచక దేశంగా మారిందని విమర్శించారు. దొంగచాటు దాడులతో వీరత్వం ప్రదర్శించడం ఇందుకు పాకిస్థాన్ ప్రభుత్వ తోడ్పాటు అందడం శోచనీయం అని తెలిపారు. కాగా ఇటువంటి ఉగ్ర చర్యల దేశానికి కట్టడి లేకుండా విర్రవీగేలా చేయడం వెనుక ప్రపంచ దేశాల వైపల్యం దండిగా కన్పిస్తోందని విమర్శించారు.

ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్థాన్‌కు తిరిగి పట్టాలెక్కించడానికి ఐఎంఎఫ్‌ 700 కోట్ల డాలర్ల(భారతీయ కరెన్సీలో రూ.59,026 కోట్లు) రుణాన్ని అందచేస్తోంది. 2024 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ రుణం విడతల వారీగా పాక్‌ అభివృద్ధి కోసం విడుదల చేస్తోంది. పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 1958 నుంచి ఇప్పటివరకు 24 సార్లు ఐఎంఎఫ్‌ రుణం అందచేసింది. 

సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరాయంగా పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఈ తరహా ఆర్థిక సహాయం అందచేయడంలోని విశ్వసనీయతను, దూరదృష్టిని భారత్‌ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది గాక 4,340 కోట్ల డాలర్ల (రూ.1.13 లక్షల కోట్లు) రుణాన్ని 764 పబ్లిక్‌సెక్టార్‌ రుణాలు, గ్రాంట్ల కింద పాకిస్థాన్‌కు అందచేయడానికి ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు ముందుకువచ్చింది. 

వీటితోపాటు 365 ప్రాజెక్టుల కోసం 4,970 కోట్ల డాలర్ల రుణాన్ని(రూ.4.19 లక్షల కోట్లు) అందచేస్తామని ప్రపంచ బ్యాంకు పాకిస్థాన్‌కు వాగ్దానం చేసింది. ఈ ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి పాకిస్థాన్‌కు రుణాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని భారత్‌ యోచిస్తున్నది.