42 శాతం రిజర్వేషన్ల పెంపు అనుమానమే!

42 శాతం రిజర్వేషన్ల పెంపు అనుమానమే!
‘అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన నిర్వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణనూ అమలు చేస్తాం’ అని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. అయితే ఇప్పుడు అటువంటి అవకాశాలు కనిపించడం లేదు.  కాంగ్రెస్‌ తీరుతో ఇప్పుడు పాత రిజర్వేషన్లకూ ఎసరు వచ్చి పడింది.
2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని స్పష్టంచేసింది. ఆ మేరకు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% ప్రకారం ఎన్నికలు నిర్వహించారు.  ప్రస్తుతం ఆ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశం ఉన్నది. కానీ ఈ పాత రిజర్వేషన్లను అమలు చేయాలన్నా ఆ మేరకు డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసులు తప్పనిసరి. లేదంటే మొత్తంగా బీసీలకు గతంలో అమలుచేసిన 22.79% బీసీ రిజర్వేషన్‌ సీట్లు కూడా జనరల్‌ స్థానాలుగానే మారే ప్రమాదం ఉన్నది.

కులగణన చేసే అధికారం రాష్ర్టానికి లేదని తెలిసినా కేవలం ఓట్ల కోసమే హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత న్యాయనిపుణులు, బీసీ సంఘాల మేధావులు చెప్పినా వినకుండా అశాస్త్రీయమైన రీతిలో కులగణన నిర్వహించింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్థూలంగా గణాంకాలను ప్రకటించింది. కులాలు, ఉపకులాల వారీగా లెక్కలను వెల్లడించలేదు. 

ఇప్పటివరకు సర్వే నివేదికనే బహిర్గతం చేయలేదు. ఆ అసంబద్ధమైన గణాంకాలనే డెడికేటెడ్‌ కమిషన్‌కు అందజేసింది. ఆ గణంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. ఆ నివేదికను సర్కారు బయటపెట్టలేదు. 

కమిషన్‌ నివేదిక ఆధారంగా సర్కారు హడావుడిగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది.  కానీ కేంద్రం మాత్రం తాజాగా రాష్ర్టాల కులగణనకు సాధికారత లేదని తేల్చిచెప్పింది. అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారు పంపిన బిల్లులను కేంద్రం ఆమోదించబోదని తేలిపోయింది. వెరసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అందని ద్రాక్షగానే మరోసారి మిగిలిపోనున్నది.