
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను ఆర్థికంగా దెబ్బకొచ్చే చర్యలను భారత్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా . ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల వస్తువులను భారత్ నిషేధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులూ ఇక్కడకు దిగుమతి కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
“పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతి ఉండదు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటనలో ప్రకటించింది.
అయితే భారత్- పాక్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ-వాఘా సరిహద్దు. ఇప్పటికే దానిని భారత్ మూసివేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పాక్ నుంచి చాలావరకు దిగుమతులు తగ్గించుకుంది. పాక్ ఉత్పత్తులపై 200శాతం సుంకాన్ని భారత్ విధిస్తోంది. ఇక అప్పటి నుంచి కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్‌కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. కానీ పాక్ నుంచి కేవలం 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే భారత్‌కు దిగుమతి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే. అయితే పాక్‌లోని కొన్ని పరిశ్రమలు భారత్‌కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి.
ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యుయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించగా పాక్‌లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది.
మరోవంక, పాకిస్థాన్ నుంచి అన్ని దిగుమతులను నిషేధించిన తర్వాత పాకిస్థాన్ షిప్‌లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించింది. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. “పాకిస్థాన్ జెండా కలిగిన ఓడలు భారతదేశంలోని ఏ పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతించబోం. అలాగే భారతీయ షిప్‌లు పాకిస్థాన్‌లోని ఏ పోర్టును సందర్శించకూడదు” అని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.
జాతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “భారతీయ ఆస్తుల భద్రత, సరుకు రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాల ప్రయోజనాల కోసం, భారత షిప్పింగ్ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ చర్య తీసుకున్నాం” అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం