అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం

అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం
అమరావతి పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామని పేర్కొంటూ అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ  శనివారంతో ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. అమరావతి భవిష్యత్​లో అద్భుత నగరంగా మారుతుందని ఆకాంక్షించారు.  ఫ్యూచర్‌ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 

ఏపీ అభివృద్ధికి అమరావతి ఎంతగానో తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబుకు గొప్ప నిబద్ధత ఉందని కొనియాడారు. రాజధాని పట్ల చంద్రబాబుకు ఉన్న దార్శనికతను అభినందిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి పర్యటన దృశ్యాలు, ప్రసంగాన్ని తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్ చేశారు. 

”అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్‌ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది.. ఇది ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథాన్ని మెరుగు పరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను ”అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా రాజధాని అమరావతి పనులు పున: ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

” రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మీడియా, సోషల్‌ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను” అని తెలిపారు. 

కాగా, “ప్రజల సహకారంతో, కేంద్రం మద్దతుతో పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్‌ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి.. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ” అని చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అమరావతి సభ వేదిక నుంచి ఏపీలో రూ. 58 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఏపీలో పలు ప్రాజెక్ట్‌లకు శకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.