ఇది మోదీ ప్రభుత్వం.. ఎవరూ తప్పించుకోలేరు

ఇది మోదీ ప్రభుత్వం.. ఎవరూ తప్పించుకోలేరు
ఇది మోదీ ప్రభుత్వమని, ఉగ్రదాడికి పాల్పడిన వారెవ్వరూ  తప్పించుకోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ పోరాటంలో భారతీయులే కాదు ప్రపంచమంతా భారత్‌తో నిలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బోడో సామాజికవేత్త ఉపేంద్రనాథ్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటూ1990 నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడుపుతున్న వారిపై ప్రధాని మోదీ జీరో టాలరెన్స్‌ పాలసీని అవలంభించారని తెలిపారు. 

ప్రభుత్వం వారిపై బలంగా పోరాడుతుందని పేర్కొంటూ మన పౌరుల ప్రాణాలు బలిగొని ఉగ్రవాదులు యుద్ధంలో విజయం సాధించామనుకుంటే పొరపాటేనని చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అది ఈశాన్య ప్రాంతమైనా, వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రాంతం అయినా, కశ్మీర్‌పై ఉగ్రవాద నీడ అయినా ప్రభుత్వం అందరికీ బలమైన సమాధానం ఇస్తుందని అమిత్ షా హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. 

“ప్రధాని మోదీ నాయకత్వంలో అది ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు కావచ్చు లేదా కశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రాంతాలు కావచ్చు. ప్రతిదానికి మేము గట్టి సమాధానం ఇచ్చాం. ఈ పిరికిపంద దాడి ద్వారా తాము పెద్ద విజయం సాధించినట్లు ఎవరైనా భావిస్తుంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఇది మోదీ ప్రభుత్వం ఎవరూ తప్పించుకోలేరని గ్రహించాలి. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా సంకల్పం” అని అమిత్ షా స్పష్టం చేశారు.

ఉపేంద్రనాథ్‌ విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెబుతూ బోడో సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వారి భాష, సంస్కృతి, అభివృద్ధి కోసం పోరాడిన చిన్న తెగులకు ఈ విగ్రహం కీలకమైందని తెలిపారు. బోడోఫా విగ్రహం బోడో సమాజంపై మాత్రమే కాకుండా అన్ని చిన్న తెగలపై కూడా గౌరవాన్ని పెంచుతుందని చెప్పారు.