పాక్‌లో సైనిక తిరుగుబాటు? పరారీలో పాక్‌ ఆర్మీ చీఫ్‌!

పాక్‌లో సైనిక తిరుగుబాటు?  పరారీలో పాక్‌ ఆర్మీ చీఫ్‌!
అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌ పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో కలవరపాటుకు గురవుతుంది. ఇప్పటికే ఓవైపు అఫ్ఘానిస్థాన్‌, బలూచిస్థాన్‌, ఇరాన్‌లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం, నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు.. మరోవైపు భారత్‌తో యుద్ధం తప్పదేమోననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.
 
పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా? భారత్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో విధాన నిర్ణయమంతా సైన్యం, ఇంటెలిజెన్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  పాకిస్థాన్‌లో ఇప్పటికే పాక్షిక సైనిక తిరుగుబాటు ప్రారంభమైంది.

ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డమ్మీగా మార్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బలహీన ప్రధానిగా పేరు తెచ్చుకున్న షెహబాజ్‌ మొదటి నుంచి సైన్యం చెప్పుచేతల్లోనే ఉన్నారు. దానిలో భాగంగానే ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న మహమ్మద్‌ అసిమ్‌ మాలిక్‌ తాజాగా పాకిస్థాన్‌ జాతీయ రక్షణ సలహాదారునిగా నియమితులయ్యారు.  ఆయన పాకిస్థాన్‌ 10వ ఎన్‌ఎస్‌ఏ కాగా, ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం, ఒకేసారి రెండు ప్రధాన పదవులకు ఒకే వ్యక్తిని నియమించడం ఇదే తొలిసారి.

మాలిక్‌ ఐఎస్‌ఐ డీజీగా 2024 అక్టోబర్‌లో నియమితులయ్యారు. పాకిస్థాన్‌లో 2022లో ఇమ్రాన్‌ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి ఎన్‌ఎస్‌ఏ పోస్టు ఖాళీగా ఉంది. తాజా నియామకంతో ఆర్మీ-ఐఎస్‌ఐ సంయుక్తంగా దేశంలో అధికారంపై పట్టు సాధించాయని భావిస్తున్నారు.  గత కొన్ని రోజులుగా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కన్పించకపోవడం, యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటనలు సైతం ఆయన నుంచి వెలువడకపోవడం చూస్తుంటే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇప్పటికే ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో విపక్ష నేత కూడా జైలులో ఉండటంతో ఇక అడిగే వారే లేకుండా పోయారు.

భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పాక్‌ సైన్యం అధికారులు, ఆ దేశ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీనితో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్‌ వేదికగా భారత్‌పై ఒత్తిడిని పెంచేందుకు పాక్‌ వేస్తున్న ఎత్తుగడ అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఉగ్రవాదులను రెచ్చగొట్టి పహల్గాం ఘటనకు మూల కారకుడిగా ప్రచారం జరిగిన పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అదృశ్యమయ్యాడనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లిపోయారని లేదా రావల్ఫిండిలోని ఓ బంకర్‌లో దాక్కున్నారని ప్రచారం జరుగుతోంది.  పాక్‌ ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా ప్రధాని షెహబాజ్‌తో ఆసిమ్‌ మునీర్‌ కలసి ఉన్న ఓ ఫొటోను విడుదల చేసింది.

తాజాగా గురువారం కూడా.. ‘భారత్‌ ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా.. తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తాం..’ అంటూ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌ను హెచ్చరించినట్టుగా ప్రకటన విడుదల చేసింది. కానీ ఆసిమ్‌ మునీర్‌ నేరుగా మీడియా ముందుకు మాత్రం ఇప్పటివరకు రాలేదు.  ఇక పాక్‌ ప్రజల్లో పలుకుబడి ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను పదవీచ్యుతుడిని చేసి, జైలుపాలు చేయడం వెనుక ఆర్మీ హస్తంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో ఆసిమ్‌ మునీరే ప్రణాళిక రచించారని, భారత ఆర్మీ దాడికి దిగితే, పాక్‌ సైన్యానికి ప్రజల మద్దతు లభిస్తుందని, సైన్యంపై పట్టు పెంచుకోవచ్చని భావించారని ఆరోపణలు ఉన్నాయి. 

భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉండటంతో ఆసిమ్‌ మునీర్‌ పట్ల పాక్‌ పాలకులు, ఆర్మీ అధికారుల్లోనే వ్యతిరేకత నెలకొందని, ఆయన అదృశ్యం వెనుక ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్‌ అదృశ్యం, భారత్‌ దాడి భయంతో పాక్‌ ఆర్మీలో వివిధ ర్యాంకుల అధికారులు రాజీనామాలు చేస్తున్నారని, ఈ అంశం పాకిస్థాన్‌ పాలకుల్లో గుబులు రేపుతోందని ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు ఆసిమ్‌ మునీర్‌ అదృశ్యం వెనుక భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రత్యేక వ్యూహమేదైనా ఉండొచ్చని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ నెలంతా కరాచీ, లాహోర్‌ గగన తలాల వినియోగంపై పాక్‌ సర్కారు పాక్షికంగా ఆంక్షలు విధిస్తున్నట్టు ఓ మీడియా నివేదిక గురువారం వెల్లడించింది. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

‘నిషేధిత గగనతలంపై ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి’ అని అధికారిక ప్రకటన పేర్కొంది. అయితే వాణిజ్య విమానాల రాకపోకలకు ఈ ఆంక్షలు వర్తించబోవని పౌర విమానయాన సంస్థ తెలిపింది. ఆంక్షల సమయంలో వాణిజ్య విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని చెప్పింది.

భారత్‌ తమ మీద దాడులు చేయొచ్చన్న భయంతో ఉన్న పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద తన బలగాల మోహరింపును ముమ్మరం చేసింది. మరోవైపు తన ప్రధాన యుద్ధ విమానాలతో ఏక కాలంలో సాధన మొదలు పెట్టింది. సైనికులకు శిక్షణ కూడా మొదలుపెట్టింది. విమానాశ్రయాల దగ్గర ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బందిని నియమించింది. రాజస్థాన్‌లోని లాంగెవాలా సెక్టార్‌ వద్ద పాక్‌ రాడార్‌ వ్యవస్థను, సైనిక, వైమానిక బలగాలను మోహరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తన ఆర్మీ యూనిట్లను, నౌకా దళాన్ని భారత్‌ సరిహద్దుల వద్దకు పాక్‌ తరలిస్తున్నది.