తిరుపతి తొక్కిసలాట మరిచిపోకముందే సింహాచలం దుర్ఘటన!

తిరుపతి తొక్కిసలాట మరిచిపోకముందే సింహాచలం దుర్ఘటన!
తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన నాలుగు నెలలలోపు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం గమనిస్తుంటే తిరుపతి అనుభవంతో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని భావించాల్సి వస్తున్నది. ప్రభుత్వ దృష్టి ప్రజావసరాల, భక్తుల భద్రతపై కాకుండా ఇతరత్రా వ్యవహారాలపై మరలుతున్నట్లు వెల్లడవుతుంది.
 
ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తిరుపతిలో చోటు చేసుకున్న దుర్ఘటన తర్వాత కూడా ఏ మాత్రం పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించటం లేదు. ఈ ఏడాది జనవరి 8 న తిరుపతిలో వైకుంఠఏకాదశి దర్శనం కోసం ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, 20 మందికిపైగా గాయాలకు గురయ్యారు.  తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన మాయని మచ్చగా నిలిచింది. 
 
మళ్ళీ బుధవారం నాడు సింహాచలం లక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించారు. దర్శనం టికెట్స్ కోసం క్యూలో నిలుచున్న భక్తులపై గోడ కూలి భక్తులు మరణించిన ఘటన ఒక్కసారిగా విషాదం నింపింది.  మనసులో సింహాచల లక్ష్మీనరసింహుడిని తలుచుకుంటూ ఆయన దర్శనార్థం వేచి ఉన్న జనం. అంతలోనే పెద్ద శబ్ధం. తీరా చూస్తే కళ్లముందే కూలిన గోడ. దాని కింద పడి ఏడుగురు దుర్మరణం జరిగిపోయింది.
 
కొద్ది రోజుల క్రితమే కట్టిన గోడ భారీ వర్షం కారణంగా కూలిపోయింది అని చెపుతున్నా దీని నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అధికారులు చెపుతున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎలాగో సింహాచలం దేవాలయంలో చందనోత్సవం ప్రతియేటా జరుగుంది. వీటికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు అనే విషయం తెలిసిందే. అయినా సరే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. 
 
కొంత మంది నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా కొత్తగా అధికారంలోకి వచ్చారా? వాళ్లకు ఎలాంటి పాలనా అనుభవం లేక పొరపాట్లు జరుగుతున్నాయి అని అనుకోవటానికి కూడా ఏ మాత్రం అవకాశం లేదు. ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వరకు అందరూ సీనియర్లే. 
 
మరి లోపం ఎక్కడ ఉంది?. ఈ ప్రభుత్వం కేవలం తనకు కావాల్సిన అంశాలపై దృష్టి సారిస్తూ, మిగిలిన విషయాలు అన్నిటిని వదిలేసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయటం, విచారణకు ఆదేశించడం, బాధితులకు ఎక్స్ గ్రేషియా లు ప్రకటించటం ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
అంతేగాని,అసలు ముందే ప్రమాదాలు జరగకుండా నివారించటానికి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకొనే ప్రయత్నాలు జరగడంలేదని భావించాల్సి వస్తున్నది. ఊహించని ప్రమాదాలను నివారించటం ఎవరి వల్ల కాకపోయినా, నిర్లక్ష్యం, అవినీతి కారణంగా జరుగుతున్న ప్రమాదాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది.  ప్రభుత్వం ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో బాధ్యులను గుర్తించి, తగు చర్యలు తీసుకోక పోవడం, పైగా అటువంటి వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తుండటం జరుగుతుంది. పాలనలో జవాబుదారీతనం లోపిస్తుంది.
 
మరోవంక, దేవదాయ శాఖలో ఇన్‌చార్జుల పాలన నడుస్తోంది. కమిషనర్‌ నుంచి ప్రధాన ఆలయాల ఈవోల వరకూ ఇన్‌చార్జులే పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ ఇన్‌చార్జిగానే కొనసాగుతున్నారు. ఎస్‌.సత్యనారాయణను బదిలీ చేసిన తర్వాత ప్రభుత్వం ఐఏఎ్‌సను నియమించుకుండా సీనియర్‌ అధికారి, అదనపు కమిషనర్‌-2గా ఉన్న రామచంద్ర మోహన్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. 
 
ఈయనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సింహచలం ఆలయం ఈవో కూడా ఇన్‌చార్జే. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన సుబ్బారావును దేవదాయ శాఖ అధికారులు రాజమండ్రి ఆర్జేసీగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ద్వారకాతిరుమల, కనకదుర్గమ్మ ఆలయాలకు తప్ప సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు రెవెన్యూ అధికారులే ఈవోలుగా ఉన్నారు. 
 
ఇన్‌చార్జి అధికారులు పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోకపోవడమూ సమస్యగా మారింది. వారు ఉపకార్యనిర్వహణాధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాలన ఆస్తవ్యస్తంగా మారుతోందన్న ఆరోపణలున్నాయి.