తమిళనాడు కాంచీపురంలోని శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన రిగ్వేద పండితుడు సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రవిడ్ (25) బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచ గంగ తీర్థం మధ్యనున్న మంటపంలో ఆయనకు ప్రస్తుత (70వ) పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస ఆశ్రమ దీక్షను ఇచ్చారు.
తొలుత ఉత్తరాధికారికి కాషాయ వస్త్రాలు ధరింపజేసి, దండం, కమండలం అందించి, శంకర మఠానికి చెందిన కొయ్యతో చేసిన పీటపై ఆశీనులను చేశారు. స్ఫటిక రుద్రాక్షమాలను మెడలో వేశారు. అనంతరం సన్యాస దీక్షను ప్రసాదించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిశంకరుల సన్నిధి వద్ద గణేశ శర్మకు ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి’గా నామకరణం చేశారు.
ఆ తర్వాత ఆలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛాటనలు, మంగళవాయిద్యాల మధ్య పీఠాధిపతి, ఉత్తరాధికారి రాజవీధిలో శంకర మఠానికి చేరుకున్నారు. అక్కడ విజయేంద్ర సరస్వతి మంత్రోపదేశం చేసిన తర్వాత కంచి మఠం యువ పీఠాధిపతిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమాన్ని వివిధ మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు కొలనులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై నుంచి వీక్షించారు. కాగా, యువ పీఠాధిపతి బాధ్యతల స్వీకార మహోత్సవ వేడుకల సందర్భంగా మఠంలో ప్రత్యేక హోమాలు, ఆరాధనలు నిర్వహించారు. యువపీఠాధిపతిని విజయేంద్ర సరస్వతి చేయిపట్టుకుని మఠంలోని మహాపెరియవా (కంచి పరమాచార్యులు), జయేంద్ర సరస్వతి స్వాములవారి బృందావన ప్రాంతానికి తోడ్కొని వెళ్లారు.
యువ పీఠాధిపతి బాధ్యతల స్వీకార మహోత్సవం సందర్భంగా కాంచీపురం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, పీఠాధిపతులు, భక్తుల సందడి మంగళవారం నుంచే ప్రారంభమైంది. ఈ వేడుకలను పురస్కరించుకుని కంచి శంకర మఠం, కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతటా రంగురంగుల విద్యుద్దీపాలంకరణ, వివిధ రకాల పూలతో, స్వాగత తోరణాలతో అలంకరించారు.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి, ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, పండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక, కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష స్వీకరించిన అన్నవరం క్షేత్రానికి చెందిన గణేశ శర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాభినందనలు తెలిపారు.
ఇంతటి పవిత్ర బాధ్యత నెరవేర్చే అవకాశం లభించడం ఆదిశంకరుల అనుగ్రహంగా పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంచి పీఠానికి ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష తీసుకోవడం గర్వకారణమని ట్వీట్ చేశారు. గణేశ శర్మ కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులు కావడం ఆనందదాయకమని మంత్రి లోకేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు