
రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా దీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటమ్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది. దీంతో పాక్‌కు సంబంధించిన కమర్షియల్, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవవడానకి అవకాశం లేదు.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో(సీసీఏ) సమావేశమైన ప్రధాని అనంతరం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో(సీసీపీఏ) భేటీ అయ్యారు. ప్రధానితోపాటు హోం మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి సభ్యులుగా ఉండే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పహల్గాం ఘటన తర్వాత సమావేశం కావడం ఇది రెండోసారి.
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనపై ప్రతీకార చర్యలు చేపట్టడంపై చర్చించేందుకు సీసీపీఏ సమావేశమైంది. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడుల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం