కులగణన నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం

కులగణన నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.  ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్న సందర్భంలో ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం అని కొనియాడారు.

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపాయని ఆయన విమర్సించారు. దీన్నో రాజకీయ అస్త్రంగా వాడుకుని, ప్రజల్లో ఆందోళనలు  రేకెత్తించేందుకు ప్రయత్నించాయని ధ్వజమెత్తారు. కానీ, ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని చెప్పారు. 

 
తాజా నిర్ణయం  కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు మరొక తాజా ఉదాహరణ అంటూ గతంలో మోదీ సర్కారు అగ్రవర్ణ పేదలకోసం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు.  1881 నుంచి 1931 కులగణన జరిగేదని, కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. 
 
దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదని, 1951లో జరిగిన కులగణనలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గణాంకాలను మాత్రమే లెక్కించారని చెప్పారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉందని, నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ పార్లమెంటులో మాట్లాడుతూ కులగణనపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారని,  అనంతరం దీనిపై చర్చించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైందని, చాలా పార్టీలు కులగణనకు మద్దతిచ్చాయని పేర్కొంటూ బీజేపీ  మొదట్నుంచీ ఈ విషయానికి సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోందని స్పష్టం చేశారు.

2011లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 5 వేలకోట్లు వెచ్చించి నిర్వహించిన సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సెస్ సర్వేకు కనీస ప్లానింగ్ లేని కారణంగా మొత్తం తప్పుల తడకగా తయారైందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సర్వే పూర్తి వివరాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని ధ్వజమెత్తారు. ఆ తర్వాత కూడా.. నాటి హోంమంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ తాము కులగణను జనగణనతో కాకుండా ప్రత్యేకంగా చేపడతామని పేర్కొన్నారని చెప్పారు.

ఇవాళ కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, 18 సెప్టెంబర్ 2024 నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కులగణనపై సరైన సమయంలో అందరికీ తెలియజేస్తామని చెప్పారని గుర్తు చేశారు.