అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడంతో చేసిన కలశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. 20 గేజ్ రాగి షీట్​కు బంగారు పూత వేసి దాన్నే ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు, ఆలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్​లో బంగారు తలుపును ఏర్పాటు చేయనున్నారు. రామ భక్తులు కోరుకున్నట్లుగానే ఆలయ శిఖరంపై కలశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.

భక్తుల కల త్వరలో నెరవేరబోతోందని చెప్పారు. కలశంపై బంగారు పూత పూసే పని జరుగుతోందని వెల్లడించారు. ప్రాకార నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మరోవైపు, రామ దర్బార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ దర్బార్​లో బంగారు తలుపును త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

రామమందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. రామ్‌ దర్బార్​లోని విగ్రహాలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని చెప్పారు.  “ఆలయ ఈశాన్యంలో శివాలయం నిర్మాణం జరుగుతోంది. నైరుతిలో సూర్యదేవుని ఆలయం నిర్మితమవుతోంది. రామమందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నాయి. అన్ని విగ్రహామూర్తులు ఆలయ సముదాయానికి చేరుకున్నాయి. మహర్షి అగస్త్య విగ్రహాన్ని సప్త మండపంలో ప్రతిష్ఠించారు. ” అని చంపత్ రాయ్ వివరించారు.

ఈ ఏడాది జూన్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. రామాలయ శిఖరంపై బంగారు కలశం అద్భుతంగా ఉంటుందని నృపేంద్ర మిశ్రా తెలిపారు. అంతేకాకుండా దేశ సంప్రదాయం, భక్తి, రామ భక్తుల విశ్వాసానికి చిహ్నంగా కూడా మారుతుందని కొనియాడారు.

2024 జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ముందే ఆలయంలోని గర్భగుడి, సింహాసనం సహా 14 ప్రధాన ద్వారాలకు బంగారు తాపడాన్ని చేయించారు. ఇప్పుడు రామ మందిరం పైభాగంలో స్వర్ణ తాపడంతో చేసిన కలశాన్ని అమర్చనున్నారు. ఈ కలశం దూరం నుంచి చూసినా మెరుస్తూ కనిపిస్తుంది. భక్తుల హృదయాలలో విశ్వాస జ్వాలను రగిలించేటట్లు కనిపిస్తుంది. ఈ కలశంపై ఏర్పాటు చేసిన బంగారు తాపడంపై ఎటువంటి మలినాలు అంటకుండా రసాయనాలు, ఆమ్లాలతో శుభ్రం చేస్తారు.