దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఆరోపణలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఆరోపణలపై కిషన్ రెడ్డి ఆగ్రహం
 దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న  విమర్శల పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ శ్రేణులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతానికి బీజేపీ అన్యాయం చేస్తుందని, పార్లమెంట్ సీట్లు కుదిస్తారని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. 
 
దక్షిణాదిలో కూడా బీజేపీ విస్తరిస్తుందని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని, తమిళనాడులో డీఎంకేను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ భవానీపురంలో ఆదివారం నిర్వహించిన మేధావుల సదస్సులో మాట్లాడుతూ అంబేడ్కర్ కరడుగట్టిన జాతీయవాది, దేశభక్తిపరుడని కిషన్ రెడ్డి కొనియాడారు. 
 
అంబేద్కర్ను ఆనాడు కాంగ్రెస్ నేతలు ఓడించే ప్రయత్నం చేశారని, ఎన్నో అవమానాలకు గురి చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌ పలుకుబడి పెరిగిందని చెబుతూ  దక్షిణాది రాష్ట్రాలకు ఏ రకంగానూ నష్టం చేకూర్చే పని బీజేపీ చేయబోదని స్పష్టం చేశారు.
 
అంబేడ్కర్, ఆయన రచించిన రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తి లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతూ రాహుల్ గాంధీకి పేదల గురించి ఏమి తెలుసని, రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకున్నంత మాత్రాన పేదల గుండెచప్పుడు రాహుల్కు తెలియదని ఎద్దేవా చేశారు. 
 
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంబేడ్కర్ స్మృత్యర్ధం దేశంలో పంచతీర్ధాలను మోదీ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.