కేసీఆర్ కు కుటుంబ స‌భ్యుల నుంచే ముప్పు

కేసీఆర్ కు కుటుంబ స‌భ్యుల నుంచే ముప్పు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపైన నిజామాబాద్ బిజెపి  ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని తెలిపారు.  అందరు ఒకే దగ్గర ఉంటే తనను కుటుంబ సభ్యులే చంపే అవకాశం ఉందనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వాఖ్యలు చేశారు.
కన్న బిడ్డలు ఆయనను కలవాలన్న ముందుగా అపాయింట్మెంట్ ఉండాల్సిందేనని చెప్పారు.  2018 ఎన్నికల కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ప్రాజెక్టు వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని అరవింద్ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని కేటీఆర్ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం పొందకముందే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి, ప్లానింగ్, నిర్మాణ ప్రదేశాలు, ప్రణాళికలలో మార్పులు చేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలులో వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోనే వరంగల్ లో ప్లీనరీ సభ పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం, అప్పటి ఇరిగేషన్ మంత్రిపైన సీబీఐ, ఈడీ విచారణ జరిపి జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా, కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డి అత్యంత ప్రమాదకరం అని విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకుంటే పాత అధికారులనే ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారులున్నారని ఆరోపించారు. ముందు అధికారుల మీద విచారణ చేస్తే ఎవరు సమర్ధవంతమైన వారో తెలుస్తుందని అరవింద్ పేర్కొన్నారు.