
పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ ‘దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడం మా మతం.. ఇది హిందూ మతం’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో `హిందూ మేనిఫెస్టో’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం పాల్గొంటూ దారుణాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యమని తెలిపారు.
“రావణుని సంక్షేమం కోసమే చంపారు. దేవుడే అతన్ని చంపాడు. ఇది హింస కాదు, అహింస. అహింస మన మతం. దురాగతాలు చేసేవారిని ఎంతో కాలం మన్నించలేం. మనం మన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయకూడదు. దీని తర్వాత కూడా, ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే, ప్రజలను రక్షించడం రాజు విధి. రాజు తన పని తాను చేసుకుంటాడు” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని డా. భగవత్ చెప్పారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని, అయితే వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారని, దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారని అంటూ పాకిస్థాన్ వైఖరిపై మండిపడ్డారు. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయర, ఇది మన స్వభావం కాదని, ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవని స్పష్టం చేశారు.
ఉగ్ర దాడి దేశ ప్రజలను ఎంతో వేధనకు గురి చేసిందని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించమని హెచ్చరించారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకునే వారమని, కానీ, ఇప్పుడు మనం బలవంతులంమని, తప్పకుండా మన బలమేంటో శత్రువులకు చూపించాలని ఆర్ఎస్ఎస్ అధినేత తేల్చి చెప్పారు.
“ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తు చేస్తోంది. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు. ఇది మా స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు, నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాలి” అని డా. భగవత్ స్పష్టం చేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు