ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం 

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం 

* భార‌త్ వైఖ‌రిని ఖండిస్తూ పాక్ సేనేట్‌లో తీర్మానం

ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రే అంగీకరించారు. ఉగ్ర సంస్థలకు నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  పెహల్‌గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నలు సమాధానాలిచ్చారు. 

ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్ట్‌ ప్రశ్నించగా ఆయన అసలు విషయం బయటపెట్టారు. “ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాకిస్థాన్ చాలాకాలంగా చేస్తుంది? మీరు ఒప్పుకుంటారా? దీనిపై మీ స్పందన ఏంటీ?” అని జర్నలిస్ట్ అడిగారు. దీనికి ఖవాజా సమాధానమిస్తూ “అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసం మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులు అన్నీ చేస్తున్నాం. అయితే అది పెద్ద తప్పు అని మాకు అర్థమైంది” అని ఆయన చెప్పుకొచ్చారు. 

“దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. అందుకే మీరు ఇప్పుడు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, 9/11 తర్వాత జరిగి దాడుల్లో మేం పాల్గొనకపోయి ఉంటే పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది” అని వాజా పేర్కొన్నారు. 

ఇక ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ గురించి కూడా ఖవాజాకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన ఖవాజా ప్రస్తుతం పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ లేదని తెలిపారు. ‘లష్కరే అనేది పాత పేరు. అది ఇప్పుడు ఉనికిలో లేదు. దాని అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ గురించి నేను ఎప్పుడూ వినలేదు’ అంటూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా భారతదేశంతో పూర్తి స్థాయిలో యుద్ధం జరగవచ్చని ఆసిఫ్‌ చెప్పారు.

ఇలాఉండగా, పెహ‌ల్గామ్ దాడితో పాకిస్థాన్‌కు లింకున్న‌ట్లు భార‌త్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ పాకిస్థాన్ సేనేట్‌ లో ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. క‌శ్మీర్‌లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. త‌మ దేశంపై ఆరోప‌ణలు చేయ‌డాన్ని భార‌త్ ఆపాల‌ని నేష‌న‌ల్ సెక్యూర్టీ క‌మిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని తీర్మానంలో పేర్కొన్నారు. 

 
ఉప ప్ర‌ధాని ఇషాక్ దార్ ఆ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. పాకిస్థాన్ పూర్తి సామ‌ర్థ్యంతో ఉన్న‌ద‌ని, త‌మ నేల‌ను కాపాడేకునేందుకు సిద్ధంగా ఉంద‌ని, జ‌ల ఉగ్ర‌వాద‌మైనా, సైనిక క‌వ్వింపు అయిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు దార్ తెలిపారు. అమాయ‌కుల ప్రాణాలు తీయ‌డం పాకిస్థాన్ విలువ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని సేనేట్ త‌న తీర్మానంలో పేర్కొన్న‌ది.  పెహల్గామ్ దాడితో పాకిస్థాన్‌ను లింక్ చేయ‌డాన్ని కూడా ఆ దేశం తప్పుప‌ట్టింది. 
 
సింధూ జ‌లాలా ఒప్పందాన్ని స‌స్పెండ్ చేయ‌డాన్ని కూడా సేనేట్ వ్య‌తిరేకించింది. చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైన‌, ఏక‌ప‌క్ష నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్న‌ది. పాకిస్థాన్ ప్ర‌జ‌లు శాంతికి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, ఈ దేశ సార్వ‌భౌమ‌త్వానికి, భ‌ద్ర‌త‌కు, ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌ల‌గ‌కుండా చూసుకుంటామ‌ని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో పాటు విదేశీ గ‌డ్డ‌ల‌పై భార‌త్ అనేక ర‌కాల ఉగ్ర‌వాదానికి పాల్ప‌డింద‌ని, దానికి ఆ దేశం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని తీర్మానంలో డిమాండ్ చేశారు.