
‘నీట్ యూజీ – 2024’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పట్నాలో అరెస్టు చేశామని ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందుతుడు. పేపర్ లీకేజీ అంశం బయటపడగానే అతడు పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు బీహార్ ప్రభుత్వం ఇటీవల సంజీవ్‌పై రూ.3 లక్షల నజరానా ప్రకటించింది.
ఈ క్రమంలోనే అతడు పట్నాలోని ఒక అపార్టుమెంట్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అక్కడికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న మరింత మంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. బీహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పని చేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటువేశారు.
ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్ బ్రాంచ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. సంజీవ్ ముఖియా పేరు ప్రధానంగా బయటకొచ్చింది. కాగా సంజీవ్ కుమారుడు శివ్‌కుమార్‌కూ ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. అతడు బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు