కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో ఓ జావాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది.  తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఐదు రోజులుగా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.
మావోయిస్టు మోస్ట్‌ వాంటెడ్‌ కీలక నేతలు హిడ్మా, దేవా టార్గెట్‌గా జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో మూడు రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి.  ఈ క్రమంలోనే శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పీఎల్‌జీఏ మహిళా సభ్యులు మఅతి చెందగా, పలువురు మావోయిస్టులు గాయపడినట్టు బీజాపూర్‌ జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. మావోయిస్టుకి చెందిన డంపు లభ్యమైనట్టు ప్రచారం జరుగుతున్నది. డీఆర్‌జీ ఎస్‌టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా, బస్తర్‌ ఫైటర్స్‌ చేపట్టిన ఈ జాయింట్‌ ఆపరేషన్‌ బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పీ నేతఅత్వంలో కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది.
కర్రెగుట్టలో సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.  గుట్ట సమీపంలోని ప్రజలు బయటకు రావద్దని ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇక మావోయిస్టుల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజననులు భయాందోళనలకు గురవుతున్నారు.
కాగా, భద్రతా సిబ్బందికి 8 హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, నీటిని సరఫరా చేస్తున్నారు. భద్రతాబలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అంతా వార్‌జోన్‌గా మారింది.
ఆపరేషన్‌ హిడ్మా పేరుతో మావోయిస్టు పార్టీ మిలటరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న హిడ్మాను టార్గెట్‌గా చేసుకొని కేంద్ర బలగాలు సెర్చింగ్‌ నిర్వహిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిడ్మా రెండు ప్లాటూన్‌ దళాలను వెంట పెట్టుకొని కర్రెగుట్టలకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర కమిటీ పరిధిలో ఉన్న కర్రెగుట్టలపై మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా కర్రెగుట్టల వద్ద హిడ్మా వచ్చాడనే సమాచారంతో అధికారులు కేంద్ర బలగాలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తున్నది.
మిలటరీ ప్లాటూన్‌ బదలాయించడంతో పాటు మావోయిస్టుల శిక్షణకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టేందుకు హిడ్మా కర్రెగుట్టలపై డెన్‌ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. కర్రె గుట్టలపై మావోయిస్టులు మందు పాతర్లతో పాటు బంకర్లను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టలు ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతాబలగాలు గుర్తించాయి.
 
ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా వరకు అలాగే మహారాష్ట్రలో గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొద్ది రోజులుగా అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పై నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.