నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. అయితే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. చార్జిషీట్‌లో సరైన పత్రాలు లేవని, ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ఈడీ వాదనలు వినిపిస్తూ కొత్త నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని, కాబట్టి విచారణకు హాజరయ్యేలా నిందితులకు నోటీసులు ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో తాము ఏమీ దాచట్లేదని, కేసు విచారణకు ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వారికి అవకాశమిస్తున్నామని తెలిపింది.
దాంతో నోటీసులు ఇచ్చే ముందు లేదంటే ఏదైనా ఆర్డర్‌ను జారీ చేసేముందు అందులో ఏదైనా లోపం ఉందా? అనే విషయాన్ని న్యాయస్థానం పరీక్షించాల్సి ఉంటుందని ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేనందున వాటిని సమర్పించాలని ఆదేశించారు. ఆ తర్వాత నోటీసులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కాగా ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను చేర్చింది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారుల తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు