
జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్ము ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బందిపొరా జిల్లాలో ఎన్‌కౌంటర్ చేటచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యారు.
పెహల్‌గామ్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రమూకలపై పంజా విసురుతున్నారు. విస్తృతంగా సెర్చ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలో బందిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్ము పోలీసులు ఆ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇక ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్ము కశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఎల్‌వోసీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
శ్రీనగర్ విమానాశ్రయంలో కూడా సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్‌లోయ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కశ్మీర్ ప్రాంతంలో ఎక్కడికక్కడ భద్రతా దళాలు మోహరించాయి. ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టాయి. అన్ని వైమానిక స్థావరాల్లోనూ యుద్ద విమానాలు కథన రంగంలోకి దిగేందుకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నావికాదళం సముద్రతీర ప్రాంతాల్లో భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరించింది. సరిహద్దులకు వేలాదిమంది సైన్యాన్ని తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు