పాక్‌ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపండి

పాక్‌ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపండి
 
* ముఖ్యమంత్రులకు హోంమంత్రి అమిత్ షా ఆదేశం
 

జమ్ము కశ్మీర్​లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న పాకిస్థానీ జాతీయలను గుర్తించి తిరిగి వాళ్ల దేశానికి పంపించాలని ఆదేశించారు. వాళ్లు తిరిగి వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.  గడువు తేదీ ముగిసే వరకు పాకిస్థాన్​ జాతీయులు ఉండకుండా చూడాలని కోరారు.

తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి ఇవ్వాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  మరోవైపు హైదరాబాద్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్‌ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. వారందరి వివరాలను సేకరించారు. రెండు రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు.

కాగా, ఇప్పటికే పాకిస్థాన్‌ పౌరులకు జారీ చేసిన వీసా సేవలను నిలిపివేసిన భారత్‌, ఈనెల 27 వరకూ అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది.  వీసాల గడువు ముగిసేలోగా పాక్‌ పౌరులంతా భారత్‌ను వీడి వెళ్లాలని చెప్పింది. అయితే, ఈ వీసాల రద్దు అంతకుముందు పాకిస్థానీ హిందువులకు జారీ చేసిన వీసాలకు వర్తించదని కేంద్రం తెలిపింది. దీంతో పలువురు పాక్‌ జాతీయులు అటారీ సరిహద్దు ద్వారా భారత్‌ను వీడి వెళ్లిపోతున్నారు. 

ఆగ్రా తాజ్​గంజ్​లోని తమ బంధువుల ఇంటికి ఒక నెల వీసాపై వచ్చిన పాకిస్తాన్​ పౌరులను పోలీసులు తిరిగి పంపించారు. కరాచీకి చెందిన ఓ కుటుంబం మాట్లాడుతూ తమ బంధువులను కలుసుకునేందుకు 45 రోజుల వీసా గడువుపై భారత్‌కు వచ్చామని తెలిపింది. గతంలో భారత్‌ సార్క్‌ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్థాన్​ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశం కల్పించారు. 

ఈ పథకం కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ, మెడికల్‌ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్‌ 29వ తేదీ వరకు గడువు ఉంది. కాగా, పాక్‌ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతోపాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు కూడా తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది.