చార్ ధామ్ యాత్ర భక్తుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తం

చార్ ధామ్ యాత్ర భక్తుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తం
 
* పర్యటకుల భద్రతపై సుప్రీంలో పిటిషన్

ఏప్రిల్ 30 నుండి ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్న చార్‌ ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు 19.5 లక్షలకు చేరుకున్నాయి. అందులో 17 వేల మంది విదేశీ పర్యటకులు సైతం ఉన్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరాఖండ్ సర్కార్ అప్రమత్తమైంది. చార్‌ ధామ్ యాత్రకు వచ్చే విదేశీ భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.

చార్‌ ధామ్ యాత్రకు భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల ప్రయాణం, దర్శనం సజావుగా, సురక్షితంగా సాగేలా ఏర్పాట్లను మెరుగుపరిచే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు తమతో పాటు చార్ ధామ్ యాత్ర గురించి ఓ సానుకూలమైన సందేశాన్ని తీసుకెళ్లేలా చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

చార్‌ ధామ్ను సందర్శించడానికి 17 వేలకు పైగా విదేశీ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో యూఎస్, యూకే, మలేసియా, నేపాల్, ఆస్ట్రేలియాతో సహా 103 దేశాల పౌరులు ఉన్నారు. పర్యటక శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం, కేదార్‌ నాథ్ ధామ్‌కు 6100, బద్రీనాథ్‌కు 4800, గంగోత్రి ధామ్‌కు 3150, యమునోత్రికి 2750 మంది విదేశీ యాత్రికులు నమోదు చేసుకున్నారు.

మొత్తం మీద చార్ ధామ్ యాత్ర కోసం 19,95,929 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో కేదార్‌నాథ్ ధామ్‌కు 6,81,81, బద్రీనాథ్‌కు 6,01,278, గంగోత్రి ధామ్‌కు 3,54,649, యమునోత్రికి 3,23,551, హేమకుండ్ సాహిబ్‌కు 34,633 మంది భక్తులు నమోదు చేసుకున్నారు.

“ఇప్పటివరకు 17 వేలకు పైగా విదేశీ భక్తులు చార్‌ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం విదేశీ భక్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే గంగా హారతి ఎక్కడ నిర్వహించినా విదేశీ భక్తులకు అందుబాటులో ఉండేలా చేయాలి. తద్వారా చార్‌ ధామ్ యాత్రను విదేశాలలో ప్రచారం చేయవచ్చు.” అని ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు.

చమోలి జిల్లాలో చార్ ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. యాత్ర సమయంలో బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ సూచనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరవడంతో చార్‌ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌ నాథ్ తలుపులు మే 2న, బద్రీనాథ్ ఆలయ తలపులు మే 4న తెరుస్తారు. గంగా హారతి హరిద్వార్, రిషికేశ్ లలో జరుగుతుంది. అయితే విదేశీ భక్తులను రిషికేశ్‌ లో గంగా హారతిలో పాల్గొనడానికి ఈసారి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

జమ్ముకశ్మీర్‌ లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటకుల భద్రతపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కొండలు ఉన్న రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలను సందర్శించే పర్యటకుల రక్షణ కోసం భద్రతా చర్యలు తీసుకోవాలని, టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సాయుధ బలగాలను మోహరించాలని కేంద్ర హోం శాఖ, ఆయా రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు.

త్వరలో ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రలో భక్తులు, పర్యటకులు భద్రతకు చర్యలు తీసుకునేలా దిశానిర్దేశం చేయాలని పిల్లో విశాల్ తివారీ కోరారు. ఉత్తరాది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుందని, ఉగ్రదాడులు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. పర్యటకుల రక్షణ కోసం భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇటీవల ఉగ్రదాడి జరిగిన పహల్గాం సమస్యాత్మక ప్రాంతం అయినప్పుటికీ, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్తో సరిహద్దు పంచుకున్న అన్ని ప్రాంతాల్లో పఠాన్‌ కోట్ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.  జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పఠాన్‌ కోట్ ద్వారా జమ్ముకశ్మీర్ నుంచి వచ్చేవారు పంజాబ్‌ లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.