పహల్గాం మృతుల్లో తెలంగాణ ఐబీ ఆఫీసర్‌

పహల్గాం మృతుల్లో తెలంగాణ ఐబీ ఆఫీసర్‌
 
* విశాఖ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కూడా మృతి
 

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో తెలంగాణలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) విభాగంలోని కంప్యూటర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనీశ్‌ రంజన్‌ మృతిచెందారు. ఇటీవల ఫ్యామిలీతో కశ్మీర్‌ టూర్‌ వెళ్లిన ఆయన్ను ముష్కరులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఐడీ చూసి మరీ ‘నువ్వు ఐబీ ఆఫీసర్‌వు కదూ.. నిజం చెప్పు’ అంటూ పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారని విశ్వసనీయ సమాచారం.

కాగా, ఆధార్‌ కార్డు చూసి హైదరాబాద్‌ వాసిగా నిర్ధారించారు. మృతుడు మనీశ్‌ రంజన్‌ది బీహార్‌. భార్య, ఇద్దరు పిల్లలతో ఎల్‌టీసీపై టూర్‌కు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే మనీష్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే వారిని దూరంగా పరిగెత్తమని మనీశ్‌ కోరినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లోని ఐబీ ఆఫీసులో కంప్యూటర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
 
ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి (రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి) మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు.  ఏదైనా ఉంటే వెళ్లి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి చెప్పుకోవాలని చంద్రమౌళితో చెబుతూ అతడిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. 
 
మూడు గంటల తరువాత చంద్రమౌళి మృతదేహాన్ని పర్యాటకులు గుర్తించారు. సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులు పహల్‌గామ్‌కు బయలుదేరారు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్ము కాశ్మీర్‌కు ఆరుగురు వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు.