బుధవారం సెయింట్ పీటర్స్ బాసిలికాలో ప్రజల దర్శనార్థం పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని ఉంచాలని కార్డినల్ నిర్ణయించారు. అలాగే పోప్‌నకు చెందిన ఫిషర్‌మ్యాన్స్ రింగ్, సీసం ముద్రను మరెవరూ ఉపయోగించకూడదని తీర్మానించారు. సంప్రదాయం ప్రకారం, పోప్‌ను సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేస్తారు. కానీ దీనికి భిన్నంగా రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో తనను ఖననం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు.
తన అంత్యక్రియలు జరగడానికి రోమ్‌లోని నాలుగు ప్రధాన చర్చిల్లో ఒకటైన సెయింట్ మేరీ మేజర్‌ను ఎంపిక చేసుకోవడంలో కూడా పోప్ ఫ్రాన్సిస్ సంప్రదాయాన్ని ఛేదించారు. వాటికన్ సిటీ నుండి రోడ్డు మార్గాన రోమ్‌లోని సెవెన్ హిల్స్‌లో ఒకటైన ఎస్క్యూలిన్ వరకు అంతిమ యాత్ర సాగుతుంది.
పోప్ తన పదవికి ఒక మానవతా, వినయపూర్వకమైన కోణాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ పరితపించేవారు. ఆ స్ఫూర్తితోనే వాటికన్ సాంప్రదాయ వైభవాలను విడనాడి తన అంత్యక్రియల ప్రక్రియ, ఖననం అంతా కూడా సరళమైన ఆచార వ్యవహరాల్లో సాగాలని నిర్ణయించారు. ఆర్భాటాలేమీ లేకుండా సాదా సీదాగా తనను భూమిలో ఖననం చేయాలని ఆయన కోరారు. లాటిన్ భాషలో తన పేరును ఫ్రాన్సిస్కస్ అని మాత్రమే రాయించాలని సూచించారు.
“నా జీవితాంతం నేను ఒక ప్రీస్ట్‌గా, బిషప్‌గా పనిచేశారు. నేను ఎల్లప్పుడూ మన ప్రభువు తల్లి, బ్లెస్డ్ వర్జిని మేరీకి నన్ను నేను అప్పగించుకున్నాను. కనుక నన్ను సెయింట్ మేరీ మేజర్ పాపల్ బాసిలికాలో ఖననం చేయాలని కోరుకుంటున్నాను. పునరుత్థాన దినం కోసం అక్కడే నేను వేచి ఉండాలని కోరుకుంటున్నాను. నా సమాధి చాలా సామాన్యంగా, ప్రత్యేక ఆకర్షణ లేకుండా ఉండాలి” అని ఆయన కోరుకున్నారు.
పోప్ అంత్యక్రియలకు హాజరయ్యే ప్రపంచ నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. వలసల సమస్యపై పోప్ ఫ్రాన్సిస్‌తో ట్రంప్ పదేపదే విభేదించిన విషయం తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జు, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అద్యక్షులు లూలా డసిల్వా, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ, ఇయు చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యురోపియన్ కమిషన్, యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు సహా పలువురు అధినేతలు రానున్నారు.
ప్రస్తుతం వాటికన్‌లో తొమ్మిది రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అంత్యక్రియలు జరిగే రోజు శనివారం జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు పోలెండ్ ప్రకటించింది. తూర్పు తైమూర్ దేశం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. పోప్ మృతికి సంతాప సూచకంగా భారత్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 22, 23 తేదీలతో పాటూ అంత్యక్రియలు జరిగే 26న సంతాప దినాలుగా పాటిస్తోంది. ఆయన తన పదవీకాలంలో సాంప్రదాయవాదులతో ఘర్షణ పడ్డారు. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!