 
                కేంద్ర రోడ్డు, రవాణా శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ఓ సరికొత్త ప్రతిపాదనతో దేశ ప్రజల ముందుకొచ్చారు. వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. నవభారత్ టైమ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు.
అన్ని వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాలు ఉత్పత్తి చేసే శబ్దాలనే వినియోగించేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 
ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా వచ్చే శబ్దాలు ఇందులో ఉంటాయని చెప్పారు. ఆయా ధ్వనులు వినడానికి ఎంతో హాయిగా ఉంటుందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో వాయుకాలుష్యంపై కూడా నితిన్ గడ్కరీ మాట్లాడారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం మిథనాల్, ఇథనాన్తో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. 
ఇక భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమ బలాన్ని కూడా గడ్కరీ హైలెట్ చేశారు.  కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతి ద్వారా దేశం గణనీయమైన ఆదాయాన్ని అర్జిస్తున్నట్లు చెప్పారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.22 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు. మన ఆటోమొబైల్ మార్కెట్ జపాన్ను అధిగమించి అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచిందని వివరించారు.
                            
                        
	                    




More Stories
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు