మహా పతివ్రత కణ్ణగి ధర్మాగ్రహానికి భస్మమైన మధురైనగరం

మహా పతివ్రత కణ్ణగి ధర్మాగ్రహానికి భస్మమైన మధురైనగరం
 
* ఆకారపు కేశవరాజు                                                                                                      *చైత్ర పౌర్ణమి సందర్భంగా


చెన్నై విమానాశ్రయంలో పెద్ద పెయింటింగ్, మెరీనా బీచ్ లోనూ కోపంతో రగిలి పోతూ జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కడియం పట్టుకుని ఉన్న స్త్రీ విగ్రహం ఉంటుంది ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు #కణ్ణగి. ఈమె పేరు ఎపుడూ వినలేదా?  ఏకాత్మతా స్తోత్రం పఠించే కొన్ని లక్షల మంది ఈమె పేరును ప్రతిరోజు “ద్రౌపదీ ‘కణ్ణగీ’ గార్గీ మీరా దుర్గావతీ తధా” అంటూ స్తోత్ర గానం చేస్తుంటారు.

వారి చరిత్రలోని కొన్ని ఘట్టాలను ‘శిలప్పతిగారం’ అని పిలువబడే ప్రాచీన తమిళ గ్రంథంలో వివరించాడు అప్పటి జైన మతానికి చెందిన ‘ఇలంగో అడిగళ్’ నాగపట్నం ప్రాంతంలో ఉండే బొంబుహార్ అనే గ్రామానికి చెందినవారు. ఈ ‘శిలప్పతిగారం’ లోని కణ్ణగి కథ గురించి ముందుగా తెలుసుకుందాం. మొదటి శతాబ్దంలో,  ఇప్పటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం తమిళనాడు పాండ్యరాజు నెడుంజెరియన్ కాలంలో జరిగిన సంఘటన.  నెడుంజెరియన్ రాజు  రాజ్యం ఉత్తరాన హిమాలయాల దాకా, ఇటు తూర్పు ఆసియా ప్రాంతం వరకు వ్యాపించి ఉండేది. 
ప్రజలు అతన్ని గౌరవంగా ‘ఇంద్రుడు’ అన్న పేరుతో పిలిచేవారు. వారు ధర్మ ప్రభువు. ఆయన రాజధాని నేటి మధురై పట్టణం తమిళనాడు. ఆయన నిలువెత్తు ధర్మానికి మారు పేరు. హిమాలయ కొండల మీద ఆయన రాజ్య పతాకం రెపరెపలాడుతుండేదంటే హిమాలయాల వరకు అతని రాజ్యము వ్యాపించిందని అర్థం. ఆయన పాలనా కాలములో కావేరీ పట్టణంలో ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు. ఆయన కుమారుడు మంచి విద్యావంతుడు. రూపసి, ఆయన పేరు కోవలన్. యుక్తవయసు వచ్చిన కుమారునికి వ్యాపారం అప్పజెప్పేముందు తగిన కన్యను చూసి వారికి వివాహం జరిపించారు. ఆమె పేరు ‘కణ్ణగి’. వారిది అన్యోన్య దాంపత్యం.
 
ఒకరోజు ఆయన ఒక నర్తకి నాట్యానికి వెళ్ళగా ఆ నర్తకి మీద అతనికి మనసు పడింది. ఆ నర్తకి పేరు మాధవి. వజ్ర వైడుర్యాల వ్యాపారం చేసే కోవలన్ ఆ నర్తకి వ్యామోహములో పడి, తన వ్యాపారాన్ని వదలి మొత్తం తన ఆస్తులు సంపద అంతా ఆమె పాదాక్రాంతం చేసాడు. సాధ్వి అయిన కణ్ణగి కోవలన్ ని ఒక్క మాటకూడా అనలేదు. మొత్తం ఆస్తులన్నీ హరించుకుపోయాక ఆ నర్తకి మాధవి కోవలన్ ని నిరాదరణకు గురి చేసింది. చివరకు కోవలన్ ఇంటి దారి పట్టక తప్పలేదు.
చాలా రోజులకు ఇంటికి వచ్చిన భర్తను కణ్ణగి అమిత ఆధారంతో ఆహ్వానించి ఆయనకు సర్ది చెప్పింది. ఆస్తులన్నీ పోగొట్టుకుని ఈ పట్టణములో ఉండలేమని వారిరువురూ మధురై పట్టణానికి చేరుకున్నారు. ఆమె కాళ్ళకు రెండు కడియాలు (మురుగులు) ఉండేవి. వాటిలో చాలా విలువైన  మాణిక్యాలు ఉన్నాయి. అందులో ఒక దానిని తీసి భర్త చేతికి ఇచ్చి దానిని అమ్మి వ్యాపారం చేయమని ప్రోత్సహించింది.
 
కోవలన్ ఆ మురుగు తీసుకుని ఒక బంగారు కొట్టు దగ్గరకు వెళ్ళి అమ్మబోగా ఆతన్ని రాజభటులు పట్టుకున్నారు. కారణం మధురై మహారాజు నెడుంజెరియన్ పట్టపురాణి భవనములో ఆమె ధరించే ఒక కాలి మురుగు ఎవరో సేవకులు దొంగిలించారు. ఆ దొంగ ఇతడే అని రాజూ కొలువుకు తీసుకు వెళ్ళి విచారించి, మహారాణి కాలి మురుగు అతని దగ్గర దొరికిన మురుగు ఒకే రకంగా ఉండటముతో ఆతన్ని దొంగగా నిర్ధారించారు. 
 
ఏనుగుతో తొక్కించి చంపమని న్యాయాధికారులు తీర్పు ఇచ్చారు. భటులు శిక్ష అమలు చేశారు. ఈ వార్త విన్న కణ్ణగి శోకతప్త హృదయయై తన కాలికి ఉన్న మరో మురుగు తీసి రాజాస్థానానికి బయలు దేరి, అక్కడ రాజాస్థానములో నిజానిజాలు నిర్ధారణ చేసింది. తన భర్త చేతిలోని మురుగు అపూర్వ మాణిక్యాలు పొదిగిందని, మహారాణి వారి ‘కాలి మురుగు’ కేవలం ముత్యాలు పొదిగిందని ఋజువు చేసింది. తన భర్త మరణానికి కారణమైన అన్యాయపు తీర్పును ప్రశ్నించింది.

తన భర్తకు మరణశిక్ష విధించడం వారి అన్యాయపు తీర్పు అని నిరూపించింది.  సామాన్య ప్రజల ఎడల పాలకులైన వారు తాము చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలంటూ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించింది. ఆ నిజాలు చూసిన మహారాజు హతాశుడయ్యాడు. తాను ఒక మహారాజుగా ఉండి ఒక చిన్న కాలి మురుగు కోసం తన రాజ్యములో ఒక అమాయకున్న్ని దోషిగా నిర్ధారించి శిక్షించానే, ఇక తన పాలన ఎందుకు? ఇటువంటి అధర్మపు తీర్పు ఇచ్చిన తనకు ఇంక ఈ జీవితం వద్దని అక్కడికక్కడే మరణించాడు. 

తన భర్తను అన్యాయంగా చంపిన ఈ మంత్రి, ఈ మహారాణి, న్యాయాధికారులు, అధర్మానికి నిలయం అయిన ఈ రాజభవనం,ఈ పట్టణం మొత్తం కాలిపోవాలని కణ్ణగి శపించింది. భర్త మరణాన్ని చూసి మహారాణి కూడా అక్కడికక్కడే మరణించింది. మధురై మీనాక్షి గుడితో పాటు అక్కడి ఆలయాలు, గోవులు వేద పండితులు తప్ప మొత్తం కణ్ణగి కోపాగ్నికి మధురై పట్టణం కాలి బూడిద అయిపోయింది.

అన్యాయపు తీర్పు ఇచ్చానని ఇంద్రుడని ప్రజలు గొప్పగా పిలుచుకున్న నెడుంజెరియన్ మహారాజు తన దేహమే విడిచాడు. అమాయకురాలు మహా పతివ్రత అయిన కణ్ణగికి తీరని దుఖాన్ని కలిగించినందుకు ఆమె శోక హృదయం మదురై పట్టణాన్నే కాల్చి వేసింది. 

ఆ తర్వాత కణ్ణగి పాండ్య రాజ్యాన్ని వదలి ‘చేర రాజ్యానికి’ (నేటి కేరళ ప్రాంతం) వెళ్ళిపోయింది. అక్కడ ఒక చెట్టు కింద వీరాగిణి యై, ఇడుక్కి జిల్లా ‘కుముళీ’ అనే గ్రామానికి 35 కి. మీ. దూరంలో గల ‘వన్నాతిపార’ కొండలపైన  చైత్ర పౌర్ణమి రోజున తన శరీరంతోనే స్వర్గారోహణం చేసిన కన్నగిని మంగళాదేవిగా, ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. చైత్ర పౌర్ణమి (2024సం.ఏప్రిల్ 23వ తేదీ) సందర్భంగా ఇక్కడ తమిళనాడు కేరళకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారి మోక్ష స్థానాన్ని దర్శించుకుంటారు..

ప్రాచీన చేరనాడు(కేరళ ) పరిపాలించిన తమిళ రాజు చేరన్ చెంగుట్టువన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం ‘వన్నాతిపార’ వద్ద కణ్ణగి కోసం ఆలయాన్ని నిర్మించాడు.  దానిని ‘కన్నగి కొట్టం’ లేదా ‘మంగళాదేవి – కన్నగి ఆలయం’ అని పిలిచాడు. ఆలయంలో విగ్రహాల నిర్మాణం కోసం హిమాలయాలకు వెళ్లి శిలలు తెచ్చారు.  
 
ఆ క్రమంలో స్వాగతించిన వారిని ఆదరించాడు. తనను ఎదిరించిన రాజులందరినీ ఓడించాడు. తన సంబంధంలోకి వచ్చిన రాజులతో హిమాలయాల నుండి రాళ్లను వారి తలపై పెట్టుకుని గౌరవంతో తీసుకువచ్చేట్లుగా ఆజ్ఞాపించినట్లు, అలా తెప్పించిన రాళ్ళతో  ‘వన్నాతిపార’  ఆలయ విగ్రహాలు తయారుచేయించారని చరిత్ర. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించాడు.
విదేశీయుల ఆక్రమణల కాలంలో ఆగిపోయిన పూజలు మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమ్మవారికి నిత్య పూజలు లేవు.  కేవలం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఆలయ ప్రవేశం అనుమతించబడుతున్నది. అదీ చిత్ర పౌర్ణమి రోజున మాత్రమే. ఈ ఆలయాన్ని  అక్కడి భూ భాగాన్ని తమిళనాడు -కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దులో వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించారు. దీనితో తమిళనాడు రాష్ట్రం తేని, ఇడుక్కి జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది.

అప్పటి చేరరాజు , పందళం రాజు(శబరిమల) వీరందరూ కణ్ణగి ధర్మదేవతయని, మహా పతివ్రతయని, అవతార రూపమని ఆ తల్లి భక్తులుగా అనేక ఆలయాలను నిర్మించారు. అందులో ప్రముఖమైనది కొడంగలూర్ భగవతి అమ్మ ఆలయం. కణ్ణగి శిలావిగ్రహం తమిళనాడు శాసనసభ ముందు ఉండేది. ఆ శాసన సభలో ఎటువంటి అన్యాయం జరిగినా కొంతకాలానికి ఉపద్రవాలు వస్తుండేవి. (అధికారంలో ఉండే వారికి పదవీగండం వస్తుండేది.) ట్రాఫిక్ వంకతో కణ్ణగి విగ్రహాన్ని మెరీనా బీచ్ కి తరలించారు.

అన్యాయాన్ని ప్రశ్నించిన కణ్ణగిగా ఆమె పేరు చరిత్రలో నిలచిపోయింది. ఈ కథ తమిళ #శిలప్పదికారములో ఉంది. ఈ శిలప్పదికారము సంగం కాలం నాటికి చెందిన తమిళ కవి #ఇలంగోఅడిగళ్ రచించారు. అఖండ భారతాన్ని పరిపాలించి, ఒకే ఒక్క అధర్మపు తీర్పు చెప్పానని తన ప్రాణాలే విడిచాడు నెడుంజెరియన్ మహారాజు. ధర్మాన్ని నిలిపిన మహిళగా, దేవతావతారంగా భావించే కణ్ణగి మాత ఆలయంలో ప్రాచీన కాలంనుండి అనేక శతాబ్దాలు నిత్య పూజలు ఉంటుండేవి.
గతంలో పూజించి అర్చించిన విధంగా సంవత్సరంలోని ఒక రోజు మాత్రమే కాకుండా 365 రోజులు ధూప దీప నైవేద్యాలతో ఆలయంలో అమ్మవారికి పూజలు జరగాలని వారి ధర్మస్ఫూర్తి తరతరాలుగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆలయం ‘వన్నాతిపార’ అనే అటవీ గ్రామంలో ఉంది. అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాదిగా వస్తారు.
 
ఈ ఆలయాన్ని ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వారు పునరుద్ధరించి తమ చేతిలో ఉంచుకునేందుకు గొడవ పడుతున్నారు. వివిధ సమయాల్లో వెళ్ళడానికి ఆలయం దర్శనం చేసుకోవడానికి అటవీ శాఖ కూడా అనుమతి నిరాకరించింది.  కారణం ఏదైతేనేం అనేక దశాబ్దాల పాటు పూజలకు, ఉత్సవాలకు నోచుకోకుండా శిథిలమైపోయిన ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించాలి, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వమే పూనుకొని అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాదిరిగా  “వన్నాతిపార మంగళాదేవి – కణ్ణగి ఆలయ ట్రస్ట్” ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.