
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానసరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 30న దిల్లీ నుంచి 50 మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలో ఉన్న లిపులేక్ పాస్ గుండా యాత్ర కొనసాగుతుందని వెల్లడించాయి. యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు డిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ, ఉత్తరాఖండ్‌కు చెందిన అధికారులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తీర్థయాత్ర నిర్వహణను కుమావ్ మండల్ వికాస్ నిగమ్‌కు అప్పగించాలని నిర్ణయించారు. మెుత్తం ఐదు గ్రూపులు కైలాస యాత్రకు వెళతాయని అధికారులు తెలిపారు. ఒక్కొ గ్రూపులో 50 మంది ఉంటారని వెల్లడించారు. మొదటి బృందం జూలై 10న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలో ప్రవేశిస్తుంది. చివరి బృందం ఆగస్టు 22న తిరిగి వస్తుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రతి బృందం టనక్పుర్, ధార్చులాలో ఒక్కొక్క రాత్రి, గుంజీ, నభిదాంగ్లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత చైనాలోకి ప్రవేశిస్తుంది.
కైలాస యాత్ర తర్వాత తిరిగి చైనా నుంచి బయలుదేరి బుండి, చౌకోరి, అల్మోరాలో ఒక రాత్రి బస చేసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటుంది. మొత్తం యాత్ర పూర్తవడానికి ఒక్కొ బృందానికి 22 రోజుల సమయం పడుతుంది. కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు డిల్లీతో పాటు ఉత్తరాఖండ్‌లోని గుంజిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఏటా నిర్వహించే కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు పర్యటనలను కరోనా కారణంగా 2020లో నిలిపివేశారు.
ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమైంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనేందుకు వయసు 18-70 సంవత్సరాల వరకు ఉండొచ్చు. కానీ ఫిట్‌గా ఉంటేనే ఈ యాత్ర చేయాలి. రిజిస్ట్రేషన్లు అధికారిక ఎంఇఎ పోర్టల్ ద్వారా నిర్వహించబడతాయి.
ఇక ఈ యాత్ర ప్రాథమికంగా రెండు మార్గాల ద్వారా నిర్వహిస్తుంది. వాటిల్లో యాత్రికులు ఏదైనా ఎంచుకోవచ్చు. ఒకటి లిపులేఖ్ పాస్(ఉత్తరాఖండ్), నాథులా పాస్(సిక్కిం). అయితే ఎంచుకున్న మార్గం బట్టి ఖర్చులు ఉంటాయి. లిపులేఖ్ పాస్ రూట్ అయితే ఒక్కొక్కరికి రూ.1.8 లక్షలు-రూ.2లక్షలు, నాథు లా పాస్ అయితే రూ.2.2 లక్షల- రూ.2.4 లక్షల వరకు ఉండొచ్చు. అయితే మూడో మార్గం నేపాల్ నుంచి ఉంటుంది కానీ, ఖర్చు రూ.3.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా