జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి.. 26 మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి.. 26 మంది దుర్మరణం
 
* సౌదీ నుండి ప్రధాని మోదీ తిరిగి రాక…. శ్రీనగర్ కు చేరిన అమిత్ షా

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జమ్ముకాశ్మీర్ కు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత అత్యంత దారుణమైన ఈ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా,  మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 

హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా దళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. వైద్య బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా  హుటాహుటిన శ్రీనగర్ కు చేరుకున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని తన పర్యటనను వెంటనే ముగించుకొని బుధవారం ఉదయంకు ఢిల్లీకి చేరుకున్నారు.

జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి పట్ల రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రదాడి నీచమైన, అమానవీయ చర్య, పర్యాటకులపై ఉగ్రదాడి క్షమించరానిది’ అని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెల్పిన ఆమె, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.  కాగా, ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది.

అమర్‌నాథ్‌ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గామ్‌లో కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు.  

ఇక సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు ఈ మారణహోమానికి తెరలేపినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కనిపించిన వారిని కనిపించినట్లే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కాల్చినట్లు పేర్కొన్నారు. అది ఒక భయానక సంఘటనగా వారు అభివర్ణిస్తున్నారు.  దాదాపు 40 మంది పర్యాటకులను చుట్టుముట్టి.. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచారు.

మతం ఏంటని.. పేరు ఏంటని అడిగి మరీ కాల్పులు జరిపినట్లు పర్యాటకులు చెబుతున్నారు. ఐడీ కార్డులు ఇవ్వాలని వారిని బెదిరించినట్లు చెప్పారు. గాయపడిన క్షతగాత్రులు మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారుగా గుర్తించారు  ఈ ఘటన మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. 

ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్‌ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని నరేంద్ర మోదీ  తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని అమిత్‌షాను ప్రధాని ఆదేశించారు.

ఈ ఉగ్రదాడిపై అమిత్‌ షా స్పందిస్తూ పర్యటకులపై దాడి తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించానని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించానని చెప్పారు. 

అత్యవసర భద్రతా సమీక్ష కోసం తాను శ్రీనగర్‌ వెళ్తున్నానిని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి ట్వీట్‌ చేశారు. కాగా ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని సోషల్‌ మీడియా వేదికగా ఒమర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒమర్‌ అబ్దుల్లా రాంబన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.