ములుగు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల మంది పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు సమాచారం. కర్రెగుట్టలపై బాంబులు అమర్చామని, ఆదివాసీలు రావొద్దని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తున్నది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులంతా తలదాచుకునేందుకు కర్రెగుట్టల్లోకి వచ్చారన్న సమాచారం అందుకున్న పోలీసులు సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలతో వారి కోసం అణువణువు జల్లెడ పడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా వాజేడు, వెంకటాపురం (నూగూరు), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వైపుగా ఉన్న కర్రెగుట్టల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పోలీసు బలగాలకు కొరకరాని కొయ్యగా మారిన మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళం కర్రెగుట్టల్లో ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్టు తెలుస్తున్నది. పోలీసుల హిట్‌లిస్టులో మొదటి వరుసలో ఉన్న హిడ్మాను లక్ష్యంగా చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కూంబింగ్ చర్యకు దిగినట్టు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్ట సమీపంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: