శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్

మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డిని (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) ఏపీ సిట్ పోలీసుల హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి  తీసుకొని విజయవాడకు తరలించారు. శుక్రవారం రాజ్‌ తండ్రి ఉపేందర్‌ రెడ్డిని ప్రశ్నించారు. విచారణ ముగిసిన వెంటనే ‘పోలీసులు ఏం అడిగారు?’ అంటూ రాజ్‌ తన తండ్రిని వాట్సాప్‌ ద్వారా ఆరా తీశారు.

అప్పటికే ఉపేందర్‌ రెడ్డి ఫోన్‌పై నిఘా వేసిన ‘సిట్‌’ సిబ్బంది ఆ మెసేజ్‌ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ‘లొకేషన్‌’ తెలియడంతో గోవాకు వెళ్లి ఆయనను పట్టుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒక బృందం గోవాకు చేరుకుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఇంకా పనిచేస్తున్న ఒక పోలీసు ఉన్నత అధికారి వెంటనే రాజ్‌ కసిరెడ్డిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. 

మరోవైపు ఎంపీ మిథున్‌ రెడ్డికి కల్పించినట్లు తనకూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆయనకు తక్షణ ఉపశమనం లభించలేదు. అయితే గోవాలో సహితం ఆచూకీ చిక్కలేదు.  రాజ్‌ కసిరెడ్డి పోలీసులను ఏమార్చేందుకు మరో ఎత్తు వేశారు. ‘రాజేశ్‌ రెడ్డి’ పేరుతో నకిలీ ఐడీతో గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు. 

ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. రాజ్‌ కసిరెడ్డి హైదరాబాద్‌లో దిగగానే అదుపులోకి తీసుకునేందుకు ‘సిట్‌’కు చెందిన మరో బృందం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయం ‘అరైవల్‌’ గేట్‌ ముందు అధికారులు వేచి చూస్తున్నారు. అయితే రాజ్‌ కసిరెడ్డి పథకం వేరు. ఆయన.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి మరో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. 

బహుశా చెన్నై నుంచి విదేశాలకు చెక్కేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. రాజ్‌ ఎంతకీ బయటికి రాకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు, అధికారుల సహకారంతో తామే లోపలికి వెళ్లారు. అక్కడ రాజ్‌ కసిరెడ్డిని గుర్తించిన తక్షణం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో హైడ్రామాకు తెరలేపారు. ‘‘రేపు (మంగళవారం) విజయవాడలో విచారణకు హాజరవుతాను. నన్ను వదిలేయండి’’ అని పదేపదే కోరారు. 

పోలీసులు ఆయన మాటల్ని వినిపించుకోలేదు. ‘‘నాలుగు సార్లు నోటీసులిచ్చినా రాలేదు. ఇప్పుడుమాత్రం వస్తావని నమ్మేదెలా!? మాతోపాటు ఇప్పుడే రావాల్సిందే’’ అని స్పష్టం చేశారు. రాజ్‌ కసిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయనను విజయవాడలోని ‘సిట్‌’ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం సీఐడీ కోర్టులో హాజరు పరచనున్నారు.

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొంత కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రాజ్‌ కసిరెడ్డి కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా తాజాగా న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.  మధ్యంతర రక్షణ కల్పించాలంటూ రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ కేసులో తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది.