డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు పునర్విచారణ

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు పునర్విచారణ
విశ్రాంత డీజీ ఏబీ వెంకటేశ్వరరావు  జోక్యంతో దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్‌ అధికారి, కాకినాడ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  విచారణ నివేదికను 60 రోజుల్లో జిల్లా ఎస్పీకి, డీజీపీకి అందజేయాలని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానంలో అనుమతి పొందిన తర్వాత దర్యాప్తు చేపట్టి అదనపు ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించారు. 
అంతకు ముందు దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని  ఏబీ వెంకటేశ్వరరావు ఆక్షేపించారు.  వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైన వీధి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను ఆయన సోమవారం వారి స్వగ్రామం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడకు వెళ్లి పరామర్శించారు. అనంతరం వారితో కలిసి జిల్లా ఎస్పీని కలిసి ఈ కేసును తిరిగి విచారించాలని కోరారు. 
సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్ర పోలీసుశాఖ చరిత్రలోనే మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది అని దుయ్యబట్టారు.  ఇలాంటి దర్యాప్తు తన ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎఫ్ఐఆర్‌కు, ఛార్జ్‌షీట్‌కు సంబంధం లేదని, మధ్యవర్తులు చెప్పేదానికి, ఎస్పీ వాదనకు పొంతన లేదని తెలిపారు. ఛార్జ్‌షీట్ వీగిపోయేలా, కేసు కొట్టేసేలా పోలీసులు వ్యవహరించారని వెల్లడించారు. 

2022 మే 19న రాత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పని చేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. 

తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలైన అనంతబాబు రెండేళ్లుగా బయట తిరుగుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. ఇప్పుడు కేసు పునర్విచారణ బాధ్యత ఐపీఎస్‌ అధికారికి అప్పగించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగిసినట్లయ్యింది.