మజ్లీస్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ ల పోటీ

మజ్లీస్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ ల పోటీ
మజ్లిస్ పార్టీని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయడానికి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతాయని, ఇప్పటికే హైదారాబాద్ నగరంను ఎంఐఎంకు అప్పగించాయని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 
 
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోని కాకార్పొరేటర్‌లతో కిషన్‌ రెడ్డి సమావేశమైన సందర్భంగా  ఎన్నికైన కార్పొరేటర్‌లను ఓటు వేయకుండా బీఆర్ఎస్‌ బెదిరుస్తుందన్నాదని ఆరోపించారు.  అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలని ఆయన బిఆర్ఎస్ ను ప్రశ్నించారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ఆయన నిలదీశారు.
“కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయి. ఎన్నికైన కార్పొరేటర్‌లను ఓటు వేయకుండా బీఆర్ఎస్‌ పార్టీ బెదిరుస్తుంది. ఇది తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే” అని స్పష్టం చేశారు. “ఎంఐఎం కోసం ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటు వేయలేదు. బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు పోటీ చేస్తాయి. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయి? సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు?” అని నిలదీశారు. 

మజ్లిస్ పార్టీ రజాకర్ పార్టీ అవునా? కదా? రాహుల్ గాంధీ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారు? అని మండిపడ్డారు.  గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 15 నిమిషాల సమయం ఇస్తే వందకోట్ల హిందువుల సంగతి చూస్తామన్న మజ్లిస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బయట ఈ రెండు పార్టీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారని కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

“ఏ ప్రాతిపదికన కేసీఆర్ పోటీ చేయడం లేదో చెప్పాలి. ఎవరిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? కార్పొరేటర్‌లను పిలిచి ఓటు వేయొద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? మీకు చీము నెత్తురు ఉంటే ఎంఐఎంకు బహిరంగంగా ఎందుకు ఓటు వేయరు?” అని ఆయన ప్రశ్నించారు.  మీ బాస్ (ఒవైసీ)ను బుజగించేందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో డిపాజిట్ రాదని తెలిసినా పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు.