
తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనానికి 15 రోజులలో ఖాళీ చేయాలనీ కోరుతూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని.. దీనికి సంబంధించి కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చిందని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించగా, ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాయి.
విశాఖ శారదా పీఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది.
ఈ నివేదిక ఆధారంగా శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే మఠం నిబంధనలు ఉల్లంఘించిందని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పునిచ్చింది.
కోర్టు తీర్పు ప్రకారం 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్న ఈ భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం నిర్మాణం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ చెబుతోంది.. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గంలో ప్రకటించినా.. భవనాన్ని స్వాధీనపరచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.
మరి ఈ నోటీసులపై శారదా పీఠం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భవనాన్ని ఖాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా? మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా శారదా పీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఈ పీఠానికి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో రూ.250 కోట్ల భూములను తక్కువ ధరకు అప్పగించారు.
కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. అయితే పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక సమర్పించారు.. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలున్నట్లు గుర్తించారని తెలుస్తున్నది. వాటిని ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. మొత్తం మీద అటు తిరుమల, ఇటు విశాఖపట్నంలో శారదా పీఠానికి సంబంధించిన భూములు, భవనం అంశం ఆసక్తికరంగా మారింది.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం