ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో పశ్చిమబెంగాల్‌లో ముర్షిదాబాద్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి నేతలు పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
న్యాయవాది విష్ణు శంకర్ జైన్ సోమవారం ఈ విషయాన్ని న్యాయమూర్తులు బిఆర్ గవారు, అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. పశ్చిమబెంగాల్‌లో పారామిలటరీ దళాలను మోహరించాల్సిన అవసరం ఉందని, దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని న్యాయవాది విష్ణు సుప్రీంకోర్టును కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో రాష్ట్రపతి పాలనాపై రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. “కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మాండమస్ రిట్ జారీ చేయాలని మీరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం, మేము కార్యనిర్వాహక వ్యవస్థను ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాము” అని గుర్తు చేస్తూ న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని చేస్తున్న ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తమిళనాడు గర్నవర్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కి పెట్టిడంపై స్పందించి ఆ బిల్లులను సుప్రీంకోర్టు ఆమోదిస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలకు సంబంధించిన ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా ప్రస్తావించింది. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలనపై వేసిన పిటిషన్‌ను విచారించేందుకు మంగళవారం విచారణ జాబితాలో చేర్చారు.

More Stories
`మతమార్పిడి’ చట్టాలపై అత్యవసర విచారణకు సుప్రీం నో
ఢిల్లీలో జరిగిన ప్రధాన బాంబు దాడులు ఇవే !!
ఢిల్లీ నగరాన్ని కప్పేసిన పొగమంచు