జార్ఖండ్‌లో 8 మంది మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో 8 మంది మావోయిస్టులు మృతి
* కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్, మరో ఇద్దరు కీలక నేతల మృతి

జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు.

ఈ క్రమంలో ఉదయం 5.30 గంటల సమయంలో లుగు కొండల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని సీఆర్‌పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉందని తెలిపారు.  ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌ రైఫిళ్లతోపాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 
ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఎన్‌కౌంటర్‌లో అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఝీ, ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్‌ మృతి చెందారు. వీరిలో ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా వివేక్ కొనసాగుతున్నారు. వివేక్‌పై కోటి రూపాయలపైగా రివార్డు ఉంది. ఇతడిని ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఇద్దరు అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఝీపై కూడా రివార్డులు ఉన్నాయి. ఇద్దరిపై రూ.10 లక్షల చొప్పుల రివార్డులు ఉన్నాయి.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ స్వగ్రామం ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దల్‌బుద్. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జరిగిన 100 దాడుల్లో ప్రయాగ్ కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా మాంఝీ తన కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే జార్ఖండ్‌లో అత్యధికంగా రివార్డ్‌ ఉన్న రెండో మావోయిస్టు నేత ప్రయాగ్.

మాంఝీతో పాటు మరో నలుగురిపై కూడా కోటి రూపాలయపైనే రివార్డులు ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మందికి పైగా మావోయిస్టులు హతమవగా.. మరికొంతమంది మావోయిస్టులు పారిపోయారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాగ్ మాంఝీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, ఏడాది క్రితమే ప్రయాగ్ భార్య జయను పోలీసులు అరెస్ట్ చేశారు.  క్యాన్సర్‌ బాధపడుతున్న ఆమె చికిత్స కోసం వచ్చిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ క్యాన్సర్‌తో ప్రయాగ్ భార్య మృతి చెందింది.