ఉద్దవ్ థాకరే, రాజ్ థాకరే చేతులు కలిపేందుకు సిద్ధం!

ఉద్దవ్ థాకరే, రాజ్ థాకరే చేతులు కలిపేందుకు సిద్ధం!
 
మహారాష్ట్ర రాజకీయాలలో క్రమంగా ప్రాధాన్యత కోల్పోతున్న శివసేన (యుబిటి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, దూరంగా ఉంటున్న సమీప బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే తమ మధ్య విబేధాలను విస్మరించి సయోధ్యకు సంసిద్ధతను సూచించారు. మహారాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం తమ “వివాదాలను” పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇద్దరు నాయకులు చెప్పారు. అందుకు హిందీ భాషపై చెలరేగిన వివాదం వీరికి ఓ అవకాశం కల్పిస్తుంది. 
 
ఈ సంవత్సరమే మరి కొద్ది నెలల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరుగనున్న సమయంలో వీరిద్దరూ కలిసే ప్రయత్నం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.   ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ హిందీ, మరాఠీ మీడియం పిల్లలందరికీ హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   దీనిని రాజ్‌ ఠాక్రే ఇప్పటికే ఖండించగా, తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే హిందీ తప్పనిసరి చేసిన వేళ సమైక్యంగా పోరాడేందుకు ఠాక్రేలు ఏకం కానున్నారా? అనే చర్చ మొదలైంది.

హిందీ నటుడు, దర్శక, నిరాత మహేశ్‌ మంజ్రేకర్‌ పాడ్‌కాస్ట్‌లో రాజ్‌ ఠాక్రే పాల్గొంటూ ఉద్ధవ్‌తో ఉన్న విభేదాలపై స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రయోజనాలు, మరాఠీ భాషను రక్షించుకునేందుకు తమ మధ్య నెలకొన్న చిన్న చిన్న వివాదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సిద్ధంగా ఉంటే, ఆయనతో పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆయన చెప్పారు.

“పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు, మన మధ్య ఉన్న విబేధాలు చిన్నవిగా కనిపిస్తాయి. మా మధ్య ఉన్న విభేదాలను మరాఠీలు అంతగా పట్టించుకోరు. మేము ఇద్దరం కలిసి పనిచేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ సంకల్పం ఉందా? లేదా? అన్నదే ప్రశ్న?” అని రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఏమీ లేవని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యమని చెప్పారు.

ఇదే అంశంపై ఉద్ధవ్‌ ఠాక్రే స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శివసేనలో ఒకప్పుడు బాల్‌ ఠాక్రేకు వారసుడి పేరొందిన రాజ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రే తీరుతో ఆ పార్టీ నుంచి 2005లో బయటకు వచ్చేశారు. అంతేకాదు మరుసటి ఏడాదే ఎంఎన్‌ఎస్‌ పేరుతో సొంతంగా పార్టీ స్థాపించారు.

మహారాష్ట్రలో విద్యార్థులకు బలవంతంగా హిందీ బోధించడాన్ని తాము అనుమతించమని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడో భాషగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. శివసేన (యూబీటీ) కార్మికుల విభాగం ‘భారతీయ కామ్​గర్​ సేన’ కార్యక్రమంలో ప్రసంగించిన ఉద్ధవ్ ఠాక్రే, ‘తమ పార్టీకి హిందీ భాష పట్ల విముఖత లేదని, కానీ దానిని ఎందుకు బలవంతంగా అమలు చేస్తున్నారు’ అని దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎంఎన్ఎస్ ఏర్పడినప్పటి నుండి, రాజ్, ఉద్ధవ్ తరచుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వారి శత్రుత్వం తరచుగా బహిరంగంగా బయటపడింది. ఇద్దరూ ఒకరి విశ్వసనీయతను మరొకరు దెబ్బతీసే లక్ష్యంతో రాజకీయ వాక్చాతుర్యంలో వ్యవహరిస్తూ వచ్చారు. ఉద్ధవ్ శివసేన అసలు సూత్రాలను నీరుగార్చారని రాజ్ ఆరోపించారు. అయితే ఉద్ధవ్  ఎంఎన్ఎస్ ను నిజమైన రాజకీయ దృక్పథం లేని చీలిక సమూహంగా చిత్రీకరించారు. 

ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేన వర్గం పార్టీ వ్యవస్థాపకుడు, ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే వారసత్వానికి నిజమైన వారసుడిగా తనను తాను నిలబెట్టుకున్నందున రాజకీయ ఉనికి కాపాడుకోవడం ద్వారా తమ ఓట్లను కాపాడుకోవడం కోసం ఉద్ధవ్ కు రాజ్‌తో చేతులు కలపడం అనివార్యంగా కనిపిస్తున్నది. 

ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ కలిసి వస్తే అది స్వాగతించదగిన పరిణామం అని చెప్పారు. CM “ఇద్దరూ కలిసి వస్తే, మేము దాని గురించి సంతోషంగా ఉంటాము. ఎందుకంటే ప్రజలు తమ విభేదాలను పరిష్కరించుకుంటే అది మంచి విషయం. దాని గురించి నేను ఇంకా ఏమి చెప్పగలను?” అని పేర్కొన్నారు.