హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బిజెపి ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యల పట్ల బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసంపై 8 మంది బిజెపి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించారని గుర్తు చేశారు.
అటవీ భూముల్లోకి బుల్డోజర్లను పంపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారని గుర్తు చేశారు. కేటీఆర్ “ప్రధానిగా మోదీ గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది” అంటూ ట్వీట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ గారి విధేయతకు తెలంగాణ ప్రజలు గౌరవం చూపారని, అందుకే రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీని సున్నా సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
మోదీజీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాట్లాడుతున్న కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తప్పుల గురించి మాట్లాడరే అంటూ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అన్ని డాక్యుమెంటరీ ఆధారాలతో కేంద్ర పర్యావరణ శాఖ ముందు బిజెపి ఎంపీలు వాదనలు వినిపించారని పేర్కొంటూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత భారత ప్రభుత్వం నూరుశాతం చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు.
సాధికారత కమిటీ ముందు బిజెపి ఎంపీలు హాజరై, అవసరమైన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారని చెబుతూ కమిటీ నివేదిక మేరకు వచ్చే తీర్పును బిజెపి గౌరవిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బిజెపి మొదటి నుంచే అడ్డుకుంటూ వస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదని బిజెపి ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యావరణ విధ్వంసం జరిగిందని, ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు.పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కేటీఆర్ 111 జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఎందుకు ప్రయత్నించింది? ఫాం హౌస్‌లు నిర్మించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారు? అని బిజెపి ఎంపీ ప్రశ్నించారు.
భాగ్యనగరానికి ‘లంగ్స్ స్పేస్’గా ఉన్న 111 జీవో పరిధిలో చెట్లు నరికివేసి నిర్మాణాలు జరిపినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? అని ఆయన నిలదీశారు. 400 ఎకరాల హెచ్‌సియూ భూముల విషయంలో కేటీఆర్ మాట్లాడినందుకు స్వాగతిస్తున్నామని, కానీ, లక్షలాది ఎకరాల భూములు ఉన్న 111 జీవో అంశంలో తమ కుటుంబం నిర్మించిన ఫాం హౌస్‌ల గురించి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య విడదీయలేని బంధం ఉందని, ఇవి నాణేనికి బొమ్మా-బొరుసులా ఉన్నాయని, విధానాల పరంగా, వ్యవహారాల్లో రెండూ ఒకేలా ఉన్నాయని
రఘునందన్ రావు విమర్శించారు. బిజెపి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిందని, అసెంబ్లీలో ఎక్కువ సమయం కేటాయించిందని, అదే సమయంలో బీజేపీకి కనీస సమయమూ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. గతంలో అసెంబ్లీలో “అక్బరుద్దీన్ ఓవైసీ అనుమతిస్తే మాట్లాడతాం” అని బీఆర్ఎస్ నేతలు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా “అక్బరుద్దీన్ అనుమతిస్తే తెలుగులో మాట్లాడతా” అంటూ చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
“బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఎంఐఎం పార్టీతో అంటకాగింది. ఒకదశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని ప్రయత్నించారు. అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు గంటల తరబడి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. కానీ అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి కనీసం మూడు నిమిషాల మాటల సమయం కూడా ఇవ్వలేదు” అంటూ గుర్తు చేశారు.
More Stories
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు