
అంతకు ముందు, ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు చర్యలు తీసుకుంటామని ఆ దిశగా త్వరలో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్, అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ చర్చలు చాలా క్లిష్టమే అయినా వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించే విషయమై పురోగతి లేకుంటే ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము తప్పుకుంటామన్న అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ప్రస్తుతానికి ముందస్తు సమావేశాలు లేవని, అవసరం అయితే భేటీ అవుతారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై ఎలాంటి ఒత్తిడి తేవటం లేదని ఆయన విమర్శించారు. పారిస్‌లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నేతల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో వచ్చేవారం లండన్‌లో మరో విడత చర్చలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు రష్యా, ఉక్రెయిన్లు సహకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ముగించేందుకు కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు విఫలమైనా, రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలో పురోగతి సాధించలేకపోయినా, చర్చల ప్రక్రియ నుంచి యూఎస్ వైదొలిగేందుకు వెనుకాడబోదని ట్రంప్ స్పష్టం చేశారు.
రష్యా, ఉక్రెయిన్‌లలో ఏ దేశమైనా సరే ఏ ఒక్క కారణంతోనైనా శాంతి ప్రక్రియ నుంచి తప్పుకుంటే రెండు పక్షాలనూ తెలివి తక్కువ వారుగా, మూర్ఖులుగా పరిగణిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనితో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శాంతి చర్చలపై తాజాగా స్పందించింది. ఉక్రెయిన్‌తో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని, ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం