23 నుంచి భారత్ అమెరికా వాణిజ్య చర్చలు

23 నుంచి భారత్ అమెరికా వాణిజ్య చర్చలు

అమెరికా, ఇంగ్లాండ్ లతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకొనేందుకు భారత ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు.  భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఈ నెల 23వ తేదీ నుంచి జరుగుతాయి. ట్రంప్ భారీ స్థాయి సుంకాలు , ప్రపంచవ్యాప్త వాణిజ్య ప్రచ్ఛన్న పోరు దశలో ఇరుదేశాల మధ్య సంప్రదింపులు కీలక పరిణామం అయ్యాయి. ట్రంప్ 2 దశలో కూడా అమెరికా భారతదేశంతో పటిష్ట వాణిజ్య బంధానికి ఉత్సాహం చూపుతోంది. 

ఇప్పటికే అమెరికా ఈ దిశలో భారత్‌తో వాణిజ్య ఒప్పంద సంబంధిత నియమ నిబంధనలు (టిఎంఆర్) ఖరారుకు సిద్ధం అవుతోంది.  ఇందులో భాగంగా టారిఫ్‌లు, నాన్ టారీఫ్ విషయాలు, కస్టమ్స్ సరళీకృతం వంటి పలు అంశాలతో మొత్తం 19 అధ్యాయాల ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇప్పటికే భారతీయ అధికార బృందం అక్కడికి వెళ్లనుంది.

మరోవంక, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో జరుపనున్న పర్యటనలో ఆ దేశంలో వాణిజ్య ఒప్పందం విషయంలో ఓ తుది రూపు ఇచ్చేందుకు ప్రయత్నించనున్నారు. సుంకాలు, సుంకం కాని అడ్డంకులు, సేవలతో సహా అనేక అంశాలను కవర్ చేసే మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి “వాస్తవిక 90-రోజుల రోడ్‌మ్యాప్”ను రూపొందించడానికి ఏప్రిల్ 23 నుండి అమెరికాకు మూడు రోజుల పర్యటనకు భారతీయ అధికారులు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా, గత నెలలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ భారతదేశ పర్యటన సందర్భంగా తన వ్యవసాయ రంగాన్ని అమెరికా ఉత్పత్తులకు “తెరవాలి” అని చెప్పిన తర్వాత వ్యవసాయం కూడా కీలక దృష్టి కేంద్రంగా ఉద్భవించింది. ట్రంప్ ఇటీవల తమ భారీ సుంకాల విధింపునకు 90 రోజుల విరామం ప్రకటించారు. ఈ గడువులోగానే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు యత్నిస్తున్నారు.

ముందుగా ప్రస్తుత పరిస్థితులలో ఇరు పక్షాల మధ్య అభిప్రాయ బేధాలను తొలిగించుకోవడం జరుగుతుంది. తర్వాత అధికారికంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)కు రంగం సిద్ధం చేసుకుంటారు. ట్రంప్ వైఖరిని బట్టి, భారత్‌తో ఆయనకు ఇంతకు ముందటి సత్సంబంధాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సరికొత్త వాణిజ్యపరమైన డీల్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

భారతదేశం తరఫున వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రధాన దూతగా వ్యవహరిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే భారత బృందం ముఖాముఖి చర్చలు జరుపుతుంది. ఇటీవలే ఆయనను వాణిజ్య శాఖ కార్యదర్శిగా నియమించారు. అక్టోబర్ 1 నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇరు దేశాల మధ్య మూడు రోజుల పాటు సంప్రదింపులు జరుగుతాయి.