
బెంగాల్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని పేర్కొంటూ హిందువులే లక్ష్యంగా జిహాదీలు కొనసాగిస్తున్న హింసను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మరణకాండను నిలువరించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించింది.
బెంగాల్ లో హిందువులపై దాడులకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు తీసుకోకపోవడం నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఆబిడ్స్ సెంటర్ లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనకు దిగారు.
బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ గత వారం రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్ట నిరసనల సాకుతో హిందువులపై జిహాదీ హింస పెద్ద ఎత్తున జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సున్నితమైన బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం గల బెంగాల్ లో కాశ్మీర్ తరహా హిందువుల ఊచకోత సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచని హిందువులు వేలాది మంది వలస బాట పడుతున్నారని చెప్పారు. మరి కొంతమందిని బలవంతంగా కట్టుబట్టలతో తరిమేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న కూడా హిందూ కుటుంబాల భద్రత, రక్షణ కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను సంతృప్తి పరచడం, పశ్చిమ బెంగాల్‌లో ఘజ్వా ఎజెండా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బెంగాల్ రాష్ట్రంలో హిందువుల రక్షణ నిమిత్తం వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతికి పంపాలని కలెక్టర్ ను కోరారు. ఈకార్యక్రమంలో పరిషత్, బజరంగ్దళ్ నాయకులు రామారావు, అజయ్ ,అఖిల్, మోహన కృష్ణ ,ప్రవీణ్ ,అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!