2025 చివర్లో భారత్ లో మస్క్ పర్యటన

2025 చివర్లో భారత్ లో మస్క్ పర్యటన

భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.  అయితే గతేడాది సాధారణ ఎన్నికలకు ముందే ఎలాన్ మస్క్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

అప్పట్లో ఆయన మన పొరుగు దేశం చైనాలో పర్యటించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఎలాన్‌ మస్క్‌తో ఫోన్‌లో సంభాషించారు. నూతన సాంకేతికత, ఆవిష్కరణలపై పరస్పరం సహకరించుకోవటంపై ప్రధానంగా చర్చించారు. ఈ రెండు రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతానికి భారత్‌ కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చర్చించిన అంశాలపై ఇరువురు సమాలోచనలు జరిపారు.

కాగా టెస్లా కార్లు భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రమంలో ఎలాన్ మస్క్ భారత్కు వస్తున్నారు. అంతేకాకుండా భారత్- అమెరికా మధ్య సుంకాల భారం తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్‌ సంస్థలు భారత విపణిలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే షోరూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టిన ఆ సంస్థ. భారత్‌ రోడ్లపై ‘మోడల్‌ వై’ కారును పరీక్షిస్తోంది. తాజాగా ముంబయి-పుణె జాతీయ రహదారిపై ఈ కారు దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది.  ఇదిలా ఉండగా స్టార్‌ లింక్‌ ప్రతినిధులు ఇటీవల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చలు జరిపారు. ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో ఇప్పటికే స్టార్‌ లింక్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో మస్క్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది.