
* సీనియర్ ఐఏఎస్ స్మిత అగర్వాల్ పోలీసులకు ప్రశ్న
తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరును ప్రతిపక్ష పార్టీలు సహా పలువురు ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ఎండగడుతున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పోలీసులు జాటీచేసిన నోటీసులపై తీవ్రంగా స్పందించారు.
పోలీసులకు పూర్తిగా సహకరించానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానని ఎక్స్ వేదికగా ఆమె స్పష్టం చేస్తూ చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తుంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
అయితే ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొంటూ వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా? అని పోలీసులను నిలదీస్తూ దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్‌ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.
సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు పంపారు.
ఇందుకు గానూ వివరణ ఇవ్వాలని ఈ నెల 12న ఆమెకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎక్స్‌లో రీపోస్టు చేయడానికి గల కారణాలు, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
2వేల మంది అదే పోస్టును షేర్ చేశారని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని స్మితా సబర్వాల్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలా జరగకపోతే టార్గెట్ చేసినట్లువుతుందని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లవుతుందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. దానితో పోలీసుల విచారణకు సహకరిస్తున్నాను అని చెబుతూనే ఆమె ఎదురు ప్రశ్నలు వేయడం పోలీసులను ఆత్మరక్షణలో పడవేసేటట్లు చేసింది.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?