ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని తెలిపారు. యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రానికి చోటు దక్కటం కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు. గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించటంతోపాటు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని తెలిపారు.
అంతకుముందు దీనిని వెల్లడిస్తూ కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ వారసత్వ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చెప్పారు. ప్రస్తుతం మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భారత్ తరపున మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు. “భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి” అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో చెప్పారు.
మహాభారతంలో భాగంగా యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధు జనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్నూ రెండింటినీ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఎప్పటికీ భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరోటి లేదని పాశ్చాత్యులు కూడా అంగీకరిస్తున్నారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!
కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు