టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై రాజకీయ రగడ

టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై రాజకీయ రగడ
టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై అటు వైసీపీ, ఇటు కూటమి నేతల మధ్య ‘సవాళ్లపర్వం’ నడిచింది. దీనిపై గురువారం తిరుపతిలో హైడ్రామా నెలకొంది. పోలీసుల సూచన మేరకు కూటమి నేతలు మాత్రమే గోశాల సందర్శనకు వెళ్లగ  టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మందీ మార్బలంతో ప్రదర్శనగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయంటూ భూమన ఆరోపించడంతో గోశాలకు వచ్చి చూడాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. దీనికి స్పందించిన భూమన తాను గురువారం వస్తానని ప్రకటించగా, దీనిని కూటమి నేతలు స్వాగతించారు. అయితే ‘ఒకేసారి రెండు పార్టీల నేతలు గోశాలకు వెళ్లకూడదు. మందీమార్బలంతో కాకుండా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మాత్రమే రావాలి’ అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధనరాజు స్పష్టం చేశారు. 

కూటమి, వైసీపీ నేతలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించారు. అధికార పార్టీ నేతలు దీనిని పాటించగా, మందీమార్బలంతో బయలుదేరిన వైసీపీ నేతలు హైడ్రామా నడిపించారు. గురువారం ఉదయం వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భూమన నివాసానికి చేరుకున్నారు. 

వారందరితో కలిసి భూమన ప్రదర్శనగా ఎస్వీ గోశాలకు బయలుదేరగా ఇంతమందిని అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. గోశాలలోకి ప్రవేశాన్ని అడ్డుకోబోమని, అయితే ఐదుగురు, వారి వ్యక్తిగత గన్‌మెన్‌కు మాత్రమే అనుమతి ఉందని ముందస్తుగా జారీ చేసిన ఆదేశాలను గుర్తుచేశారు. గోశాల వద్దకు గుంపులుగా రావద్దని విజ్ఞప్తి చేశారు.  అయితే, తమను గోశాలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తన ఇంటి ముందే నేతలు, శ్రేణులతో కలిసి భూమన రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.

‘మీ సవాల్‌కు స్పందించి నేను గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఉదయం 9.10గంటలకు గోశాల చేరుకున్నారు. ఆవులను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వీరు గోశాలలో ఉన్నంతసేపూ పోలీసు యంత్రాంగం వెన్నంటే ఉంది. గోశాల నుంచే ఎమ్మెల్యేలు నాని, సుధీర్‌ రెడ్డి భూమనకు ఫోన్‌చేసి ఆహ్వానించారు. అప్పటికే నిరసన నుంచి ఇంట్లోకి వెళ్లిన భూమన.. మళ్లీ భారీగా శ్రేణులతో కలిసి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల చాలెంజ్‌పై తాను స్పందించానని, వారు అక్కడ ఉన్నప్పుడే తనను అనుమతించాలని భూమన పోలీసులను కోరారు