ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ

ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సిఇఒ ఎలాన్ మస్క్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. టెక్నాలజీ, సృజన రంగాల్లో భారత్, అమెరికా మధ్య సహకార పటిష్ఠతలో పరస్పర ఆసక్తిని ఉభయులూ పునరుద్ఘాటించారు. భారతీయ విద్యుత్ వాహన విపణిలో ప్రవేశానికి టెస్లా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు భావిస్తున్న సమయంలో ఉభయుల మధ్య టెలిఫోన్ సంభాషణ చోటు చేసుకుంది. 

ఈ సంవత్సరం మొదట్లో వాషింగ్టన్ డిసిలో తమ గత సమావేశం నేపథ్యంలో ఉభయులూ విస్తృత శ్రేణి అంశాలపై చర్చించారు. తాము వివిధ అంశాలపై చర్చించినట్లు మస్క్‌తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

“ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్ డిసిలో జరిగిన మా భేటీలో ప్రస్తావించిన విషయాలు సహా వివిధ అంశాల గురించి చర్చించాను. టెక్నాలజీ, సృజన రంగాల్లో సహకారానికి గల అపార అవకాశాలను మేము చర్చించాం” అని ఆయన తెలిపారు. “ఆ రంగాల్లో యుఎస్‌తో మా భాగస్వామ్యాలను ముందుకు తీసుకుపోవడానికి భారత్ నిబద్ధమై ఉంది” అని మోదీ స్పష్టం చేశారు. 

ఒకవైపు అమెరికా విధిస్తున్న సుంకాలతో ప్రపంచదేశాల వాణిజ్యం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు యూఎస్​తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ట్రంప్​తో చర్చలు జరుపుతోంది. ఇదే సమయంలో మోదీ, ఎలాన్​ మస్క్ మధ్య ఈ సంభాషణ జరిగింది. అమెరికాలో ట్రంప్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రస్తుతం ఎలాన్​ మస్క్ ఉన్నారు. 

సుంకాల విషయంలో ఇతర దేశాలతో చర్చల కోసం ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ మధ్యవర్తిగా ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఈ సంభాషణ కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంభాషణ తర్వాత భారత్​- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం రెండు మూడు వారాల్లోపు ఖరారవుతుందని వైట్ హౌస్ కూడా భావిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం భారత్​పై 26 శాతం సుంకాలను విధించింది.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోదీ గత ఫిబ్రవరిలో తన రెండు రోజుల యుఎస్ పర్యటనలో ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఆయన తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూరెలతో కలసి మోదీని కలుసుకున్నారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీకి మస్క్ ఒక స్టార్‌షిప్ షట్కోణ ఉష్ణకవచ రేకును కానుకగా ఇచ్చారు.  రానున్న మాసాల్లో ముంబయి సమీపంలో ఒక రేవుకు కొన్ని వేల కార్లను నౌకారవాణా చేయడం ద్వారా భారతీయ విపణిలోకి ప్రవేశించేందుకు టెస్లా సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

బ్లూమ్‌బెర్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ముంబయి, ఢిల్లీ, బెంగళూరులలో తమ అమ్మకాలు ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది. మరోవంక, మస్క్ ఆధ్వర్యంలోని యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ స్టార్‌లింక్‌ను భారతదేశంలోకి ప్రవేశపెట్టాలని మస్క్ చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. ఇటీవలే భారతీయ టెలికాం దిగ్గజాలు స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే, స్టార్‌లింక్ కార్యకలాపాలు దేశంలో మొదలు కావడానికి భారత ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి పొందలేదు. ఇటీవల స్టార్‌లింక్ సీనియర్ అధికారులు భారత్​కు వచ్చి వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో చర్చలు జరిపారు.