పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
ఇస్లామాబాద్‌కు కశ్మీర్‌ “గొంతుకు వెళ్లే రక్తనాళం” వంటిదని పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌  చేసిన వాఖ్యల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్‌ను పాకిస్థాన్‌ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమని చేసిన తీవ్ర వ్యాఖ్యలను కొట్టిపారేసింది. జమ్ముకశ్మీర్‌ భారత అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది. పీవోకేను పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ఆక్రమిత భూభాగాలను భారత్‌కు అప్పగించాలని తేల్చి చెప్పింది.  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ పాకిస్తాన్ తో ఉన్న ఏకైక సంబంధం ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడమేనని స్పష్టం చేశారు. “విదేశీ ఏదైనా వ్యక్తి తన గొంతులో ఎలా ఉండగలడు? ఇది భారతదేశం యొక్క కేంద్రపాలిత ప్రాంతం. పాకిస్తాన్ తో ఉన్న ఏకైక సంబంధం ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడం మాత్రమే” అని జైస్వాల్ తేల్చి చెప్పారు.
కాగా, విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను ఉద్దేశించి జనరల్‌ మునీర్ మాట్లాడుతూ 1947లో పాకిస్థాన్‌ పుట్టుకకు దారితీసిన రెండు దేశాల సిద్ధాంతాన్నిసమర్థించారు. జమ్ముకశ్మీర్‌పై కొనసాగుతున్న దీర్ఘకాల వైరాన్ని పునరుద్ఘాటించారు. ‘మా వైఖరి స్పష్టంగా ఉంది. తలకు వెళ్లే ప్రధాన రక్త నాళం ఇది. మేం దానిని మరిచిపోం. వీరోచిత పోరాటంలో మా కశ్మీరీ సోదరులను వదిలిపెట్టబోం’ అని స్పష్టం చేశారు.

ఇతర దేశాల్లో ఉంటున్న పాకిస్థానీలు తమ ఉన్నతమైన భావజాలం, సంస్కృతిని మర్చిపోవద్దనీ, పిల్లలకు పాక్‌ చరిత్ర వివరిస్తూ ఉండాలని సూచించారు. తమ తాతలు ప్రతీ అంశంలో తాము హిందువుల కంటే భిన్నమైన వాళ్లమని భావించారనీ అదే రెండు దేశాల ఏర్పాటుకు పునాది వేసిందంటూ విషం చిమ్మారు.

మరోవైపు ఇస్లామిక్ రిపబ్లిక్‌గా పాకిస్థాన్‌  ఆర్భావం గురించి జనరల్ అసిమ్ మునీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను ఆయన ప్రస్తావించారు. ‘హిందువుల కంటే మనం భిన్నమని మన పూర్వీకులు నమ్ముతారు. మన మతం వేరు. మన ఆచారాలు వేరు. మన సంప్రదాయాలు వేరు. మన ఆలోచనలు వేరు. మన ఆశయాలు వేరు. రెండు దేశాల సిద్ధాంతానికి ఇదే పునాది. మనం ఒకటి కాదు రెండు దేశాలు అనే నమ్మకంతో ఇది ఏర్పడింది’ అని పేర్కొన్నారు.

కాగా, ఉన్నతమైన భావజాలం, సంస్కృతితో పాకిస్థానీలు ముడిపడి ఉన్నారని మునీర్ తెలిపారు. దేశ పునాదికి సంబంధించిన చరిత్రను తరువాతి తరానికి అందించాలని విదేశాల్లోని పాకిస్థానీయులను ఆయన కోరారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై మాట్లాడిన ఆయన 13 లక్షల బలమైన భారత సైన్యమే తమను ఏమీ చేయలేదనీ, ఉగ్రవాదులు పాకిస్థాన్‌ ఆర్మీని ఏం చేయగలరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. 

బలూచిస్తాన్‌ వేర్పాటువాదాన్ని తమ సైన్యం అణచివేస్తుందని, మరో 10 తరాల వరకు కూడా ఉగ్రవాదులు విజయం సాధించలేరని చెప్పారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలతో ఆ దేశ సైనిక నాయకత్వానికి ఇండో పాక్‌ ఘర్షణలను పరిష్కరించే ఉద్దేశం లేదని స్పష్టమైంది. ఇటీవల ఐరాస వేదికగా శాంతి పరిరక్షక సంస్కరణల అంశంపై జరిగిన డిబేట్లో పాకిస్తాన్ కశ్మీర్పై చేస్తున్న విషప్రచారాన్ని భారత్ ఎండగట్టింది. దాయాది దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్ను ఖాళీ చేయాలని గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అసీమ్‌ మునీర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.