
ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి. ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు కూడా వినాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాల్లో అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వీరంతా ఈ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కపిల్ సిబాల్ వాదనల ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాలలో తలదూర్చారని అత్యున్నత న్యాయంస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని కపిల్ సిబాల్ తెలిపారు. “చట్టం ప్రకారం” అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించారు.
“చట్టం ప్రకారం” అనే పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. వక్ఫ్-అలల్-ఔలాద్‌ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదు.. దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? అంటూ కపిల్ సిబాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైనా వక్ఫ్‌ను స్థాపించాలనుకుంటే అతను ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తున్నాడని నిరూపించుకోవాల్సి ఉందని, ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని, సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని, ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. అయితే, హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసిందని, ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంట్ చట్టం చేసిందని, ఇందులో తప్పేముందని సిజెఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందని సిజెఐ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.
ఇస్లాంలో వారసత్వం వ్యక్తి మృతి తర్వాత జరుగుతుందని, కానీ ప్రభుత్వం మృతికి ముందే వారసత్వం వస్తుందని చెబుతుందని కపిల్ సిబాల్ వాదించారు. ప్రభుత్వ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ఆస్తిని కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వక్ప్ గా పరిగణించరాదని కొత్త చట్టంలో ఉందని కూడా కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. వక్ప్ బోర్డులో ముస్లిమేతర అధికారిని నియమించారని, ఇది తనంతట తానే రాజ్యాంగ విరుద్ధమని కపిల్ సిబాల్ పేర్కొన్నారు.
కొత్త చట్టం అమలులోకి వస్తే ముస్లింలకు చెందిన రక్షిత స్మారకం స్థలాన్ని కూడా ఇకపై వక్ఫ్ స్థలంగా పేర్కొనలేమని కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? అని రెండోది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై తెలిపింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు