సుప్రీంకోర్టు `మితిమీరిన జోక్యం’.. కేరళ గవర్నర్ అభ్యంతరం

సుప్రీంకోర్టు `మితిమీరిన జోక్యం’.. కేరళ గవర్నర్ అభ్యంతరం

శాసనసభ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిని న్యాయవ్యవస్థ ‘మితిమీరిన జోక్యం’గా ఆయన అభివర్ణించారు.  ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించాలా? వద్దా? అనేది పూర్తిగా పార్లమెంట్‌ పరిధిలోని విషయమని, ఇది ఏ మాత్రం కోర్టుల పరిధిలోని అంశం కాదని ఆర్లేకర్ స్పష్టం చేశారు.

“బిల్లులపై గవర్నర్‌ ఎంత కాలపరిమితిలోపు నిర్ణయం తీసుకోవాలి? అనేది రాజ్యాంగంలో లేదు. ఒక వేళ సుప్రీంకోర్టు ఈ కాలపరిమితిని నిర్దేశిస్తే, అది రాజ్యాంగ సవరణకు సమానం అవుతుంది. కానీ కోర్టు అలా చేయడానికి వీలులేదు. ఇది పార్లమెంట్‌కు మాత్రమే ఉన్న అధికారం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్లేకర్‌ మరో అడుగు ముందుకేసి తనదైన రీతిలో స్పందించారు.

తమిళనాడు, కేరళ సమస్యలు భిన్నమైనవని ఆయన పేర్కొంటూ  ఏదేమైనా ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

“రాజ్యాంగ సవరణలు న్యాయవ్యవస్థ చేస్తుంటే, శాసన సభ, పార్లమెంట్‌లు ఎందుకు? ఇలాంటి అంశాల్లో సవరణలు చేయాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. అలాంటిది ఇద్దరు న్యాయమూర్తులకు రాజ్యాంగాన్ని మార్చేంత అధికారం ఉంటుందా? ఇది పూర్తిగా న్యాయపరమైన అతిక్రమణ”  అంటూ విమర్శించారు.

‘బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ అది కేవలం కార్యనిర్వహక వర్గానికి మాత్రమే పరిమితమైంది కాదు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. న్యాయమూర్తుల వద్ద ఈ జాప్యాలకు తగిన కారణాలు ఉన్నట్లే, గవర్నర్‌లకు కూడా తగిన కారణాలు ఉంటాయి. దానిని అందరూ అంగీకరించాల్సిందే’ అని అర్లేకర్‌ పేర్కొన్నారు. 

గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి తగిన కాలపరిమితి ఉండాలని ప్రజలు భావిస్తే, దానిని పార్లమెంట్‌లో చర్చించి, తరువాత మాత్రమే అమలు చేయాలని ఆర్లేకర్ తేల్చి చెప్పారు. “కొన్ని కేసులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటాయి. అందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వారి కారణాలు వారికి ఉంటాయి. కొన్ని బిల్లులను క్లియర్‌ చేసేందుకు సమయం పట్టవచ్చు. అందుకు గవర్నర్‌కూ తన కారణాలు తనకు ఉంటాయి” అని అర్లేకర్‌ వ్యాఖ్యానించారు. 

మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం కేరళపై ఏమాత్రం ఉండబోదని, తన వద్ద ఎటువంటి బిల్లులు పెండింగ్‌లో లేవని అర్లేకర్‌ పేర్కొన్నారు. తనకు ముందు కేరళ గవర్నర్‌గా పనిచేసిన ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మధ్య విభేదాలు ఉన్న విషయాన్ని గురించి ప్రశ్నించగా తనకు ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయని, ఏవైనా వివాదాస్పద అంశాలు ఉంటే కూర్చుని చర్చించుకుంటామని అర్లేకర్‌ వివరించారు.