బెంగాల్‌లో మళ్లీ హింస.. ఇద్దరు మృతి !

బెంగాల్‌లో మళ్లీ హింస.. ఇద్దరు మృతి !
* వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయబోమని మమతా హామీ!
వక్ఫ్ (సవరణ) చట్టంకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ లోని ముర్షిదాబాద్‌లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు.  ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
ముర్షిదాబాద్ జిల్లాలో శనివారం నిరసనలకు సంబంధించిన హింసాత్మక ఘర్షణల తరువాత కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. హింసకు గురైన సంసేర్‌గంజ్ ప్రాంతంలోని జాఫ్రాబాద్‌లోని వారి ఇంటి లోపల బాధితులైన తండ్రి, కొడుకు బహుళ కత్తిపోట్లతో కనిపించారని పోలీసు అధికారి తెలిపారు. హర్‌గోబింద్ దాస్ (74), అతని 40 ఏళ్ల కుమారుడు చందన్ దాస్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. తండ్రి, కొడుకు అక్కడికక్కడే మరణించారు.
ఈ హింసకు కారణమైన 115 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.  పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని, హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. 
 
శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోషల్‌ మీడియాలో వ్యాప్తిచేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఘర్షణల్లో గాయపడిన 15 మంది పోలీసులు, ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వక్ఫ్‌ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, అయితే పశ్చిమబెంగాల్‌లో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 
వ‌క్ఫ్ చ‌ట్టాన్ని కేంద్రం రూపొందించింద‌ని, దీనికి స‌మాధానాలు కేంద్ర‌మే ఇస్తుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని, అంద‌రూ శాంతియుతంగా ఉండాల‌ని, మ‌తం పేరుతో విద్వేషాల‌కు పాల్ప‌డ‌వ‌ద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితం విలువైంద‌ని, రాజ‌కీయాల కోసం అల్ల‌ర్లు సృష్టించ‌వ‌ద్దు అని, హింస‌ను ప్రేరేపించి స‌మాజానికి హాని చేయ‌వ‌ద్దని ఆమె పిలుపిచ్చారు. మైనారిటీలు, వారి ఆస్తులను రక్షిస్తానని మమతా హామీ ఇచ్చారు.
కాగా, తాజాగా చోటుచేసుకున్న నిరసనలపై బెంగాల్‌లోని ప్రతిపక్ష బీజేపీ  పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించింది. దీన్ని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాల్లో గందరగోళాన్ని వ్యాప్తిచేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నమని మండిపడింది.